MANA TOLIVELUGU
Newspaper Banner
Date of Publish : 17 July 2026, 4:44 pm Posted by : MANA TOLIVELUGU

అభివృద్ధి బాటలో వనపర్తి  

జిల్లాలో పలు అధికారిక, అభివృద్ధి కార్యక్రమాలు జోరందుకున్నాయి – ఎంపీ మల్లు రవి 

మన తొలివెలుగు, ఉమ్మడి మహబూబ్ నగర్ బ్యూరో ప్రతినిధి ఎన్. హరీష్ : 

జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో కలెక్టర్ ఆదర్శ్ సురభి అధ్యక్షతన జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లు రవి, వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. 2018 నుంచి నమోదైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు, బాధితులకు అందిన పరిహారంపై వారు కేసుల వారీగా సమీక్షించారు. ముఖ్యంగా గత రెండేళ్లలో విచారణలో ఉన్న 12 కేసుల పురోగతిని జిల్లా ఎస్పీ డీ. సునీత రెడ్డి కమిటీకి వివరించారు. మర్రికుంట కేజీబీవీ పాఠశాలలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ సీఎస్‌ఆర్ నిధులు రూ.1.35 కోట్లతో జిల్లాలోని 16 ప్రభుత్వ పాఠశాలల్లో ఏర్పాటు చేసిన స్మార్ట్ క్లాస్‌ రూమ్‌లను ఎంపీ మల్లు రవి, కలెక్టర్‌తో కలిసి ప్రారంభించారు. స్మార్ట్ బోర్డుపై సంతకం చేసి విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపిన ఎంపీ.. ప్రభుత్వ పాఠశాలల్లో ఆధునిక సాంకేతిక విద్యను అందించడం అభినందనీయమన్నారు.

పంట మార్పిడిపై అవగాహన కల్పించాలి

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌కు కలెక్టర్ ఆదర్శ్ సురభి, అదనపు కలెక్టర్లు ఖిమ్యా నాయక్, వినోద్ కుమార్‌లతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ.. రైతులు ఉద్యాన పంటల వైపు మొగ్గు చూపేలా పంట మార్పిడిపై అవగాహన కల్పించాలని, వర్షాకాలం దృష్ట్యా విత్తనాలను అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు.