విచారణ జరపాలని గ్రామస్తుల డిమాండ్
మన తొలివెలుగు, గద్వాల జిల్లా ప్రతినిధి గడ్డం సుధాకర్
పంచాయతీల పాలన గాడి తప్పుతోంది. దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలనే ఆలోచనలో కొందరు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ప్రజల సొమ్మును కాజేస్తున్నారు. పంచాయతీల సర్వతోముఖాభివృద్ధి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేస్తున్న నిధులు పక్కదారి పడుతున్నాయి. అక్రమార్కులకు అధికారం అండదండలు ఉండటంతో నిధుల దుర్వినియోగం వెలుగులోకి రావటం లేదు. దీనికి తోడు ప్రభుత్వాధికారుల పర్యవేక్షణ లోపం కారణంగా లక్షల నిధులు స్వాహ అవుతున్నాయి. కేటిదొడ్డి మండలం ఇర్కిచేడు గ్రామ పంచాయతీలో నిధుల దుర్వినియోగం జరిగినట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పాలకవర్గాలు కొలువుదీరాక ఈ ఏడాది ఫిబ్రవరిలో 15వ ఆర్థిక సంఘం నిధులు జనాభా ప్రాతిపదికన గ్రామ పంచాయతీలకు కేటాయించారు. గతంలో రెండేళ్ల పాటు పల్లెల్లో ప్రత్యేకాధికారుల పాలన కొనసాగింది. అప్పట్లో ఇష్టారాజ్యంగా ఖర్చులు చేసి బిల్లులు చేయగా.. వచ్చిన ఆర్థిక సంఘం నిధుల నుంచి డ్రా చేయడం కొసమెరుపు. ఇటీవల 15వ ఆర్థిక సంఘం నిధులు జమకావడంతో 2023-2024, 2024-2025 లలో గ్రామంలో చేసిన వివిధ పనులకు ప్రస్తుత సర్పంచ్, ఉపసర్పంచ్ పాలకవర్గం అంగీకార పత్రంతో చేయని పనులకు కూడా నిధులు మళ్లించడం జరిగిందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, మౌలిక వసతుల కల్పన వంటి వాటిలో చేసింది కొంతైతే.. ఎక్కువ మొత్తంలో చెల్లించినట్లు తెలుస్తోంది. వాస్తవానికి పంచాయతీలో చేపట్టే ప్రతి పని పాలక వర్గం, గ్రామ కమిటీల ఆమోదంతో తీర్మానం మేరకు జరగాలి. కానీ, ప్రస్తుతం ఎక్కడా పట్టించుకోవడంలేదు. ఇలా పంచాయతీ కార్యదర్శుల భార్యలు, కుటుంబ సభ్యులు, సన్నిహితుల ఖాతాల్లోకి మళ్లించినట్లు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది.
పాలకవర్గం అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని, కొందరు రాజకీయ నాయకుల అండదండలతో గ్రామ పంచాయతీ కార్యదర్శి నిధులను ఇష్టానుసారంగా డ్రా చేస్తున్నారని స్థానిక నాయకులు ఆరోపిస్తున్నారు.

అవకతవకలు ఇలా ..
ఇర్కిచేడు గ్రామపంచాయతీలో 2025- 2026 ఆర్థిక సంవత్సర నిధుల నుంచి మార్చి 26వ తేదిన వివిధ పనుల నిమిత్తం నిధుల డ్రా కోసం అంగీకారం చేస్తూ సర్పంచ్ , ఉపసర్పంచ్ లు తీర్మానం చేశారు. గ్రామ సభ నిర్వహించినందుకు గాను రూ.31,500. జనవరి 26న గణతంత్ర దినోత్సవ సందర్భంగా 26,500 ఖర్చు చేసినట్లు, సర్పంచ్ కొత్త కుర్చీ రూ.11,990, కొత్త టేబుల్ రూ.16,990 కొనుగోలు చేసినట్లు, వీధి లైట్ల కోసం 38,000 , పరిసరాల పరిశుభ్రత కోసం రూ.22,880 నిధులు డ్రా చేసుకోవడం ఏమిటని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అయితే డ్రా చేసిన నిధులు ఒకే వ్యక్తి ఖాతాకు మారడంపై గ్రామస్తులు అరా తీశారు. ఇలా 15వ ఆర్థిక సంఘం నిధులను ఒకే సారి చేయని పనులకు తప్పుడు బిల్లులతో డబ్బులు డ్రా చేసుకున్నట్లు తెలిసింది.
బంధువుల ఖాతాల్లో..?
గ్రామంలో ఏపని చేసినా దానికి సంబంధించిన బిల్లు మొత్తం సామాగ్రి కొనుగోలు చేసిన దుకాణం పేరిట సంబంధిత యజమానుల ఖాతాలో పంచాయతీ ఖాతా నుంచి విడుదల చేయాలి. కానీ ఇక్కడ అవేమీ పట్టించుకోకుండా ఆ గ్రామానికి చెందిన కార్యదర్శి పక్కా ప్లాన్ తో నిధులు మల్లించడం కొసమెరుపు. సంబందం లేని వివిధ పనుల పై డబ్బులు బందువులు, సమీప సన్నిహితుల ఖాతాలోకి ట్రాన్స్ఫర్ చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
వినోద్ కుమార్ గ్రామ కార్యదర్శి
గ్రామ పంవాయతీ కార్యదర్శి వినోద్ కుమార్ ను వివరణ కోరగా గ్రామంలో చేసిన వివిధ పనులకు నిధులు డ్రా చేసినట్లు ఎక్కడ ప్రజాధనం దుర్వినియోగం కాలేదని పేర్కొన్నారు.
రామన్ గౌడ్- ఇంచార్జీ ఎంపీఓ
ఇంచార్జ్ ఎంపీఓ రామన్ గౌడ్ ను వివరణ కోరగా.. గ్రామ పంచాయతీ నిధులు పక్కదారి పట్టినట్లు మా దృష్టికి రాలేదన్నారు.