MANA TOLIVELUGU
Newspaper Banner
Date of Publish : 03 May 2026, 8:47 pm Posted by : MANA TOLIVELUGU

ఈనెల 18,19 రామన్నపేట లో నిర్వహిస్తున్న తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా మహాసభలను జయప్రదం చేయండి 

కొండమడుగు నర్సింహ్మ పిలుపు

మన తొలివెలుగు, యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో ప్రతినిధి జంగిటి రవీందర్ 

ఈనెల 18, 19 తేదీలలో రామన్నపేట మండల కేంద్రంలో నిర్వహిస్తున్న తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా 3వ మహాసభలను జయప్రదం చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొండమడుగు నర్సింహ్మ పిలుపునిచ్చారు.

ఆదివారం భువనగిరి మండల పరిధిలోని చీమలకొండూరు గ్రామంలో మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ సంఘం ఆధ్వర్యంలో ” గోడపత్రికను ” ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నర్సింహ పాల్గొని మాట్లాడుతూ అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా అనేక కూలీ, భూమి, ఉపాధి, సంక్షేమం, విద్య, వైద్యం, కూలీ పేటలో అభివృద్ధిపై నిరంతర ఉద్యమాలు నిర్వహిస్తూ వ్యవసాయ కూలీలకు అండగా వ్యవసాయ కార్మిక సంఘం నిలిచిందని తెలిపారు. వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం మొదలుకొని అనేక ఉద్యమాలు నిర్వహిస్తూ భూమిలేని ప్రతి పేదవాడికి ప్రభుత్వ భూములు పంచాలని కోరుతూ అనేక సమరశీల పోరాటాలు నిర్వహించి లక్షల ఎకరాల భూములను దేశవ్యాప్తంగా పంచిన చరిత్ర వ్యవసాయ కార్మిక సంఘానికి ఉన్నదని అన్నారు. నేడు గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని తీసుకురావడంలో కూడా ఆనాడు కీలకపాత్ర పోషించిందని తెలిపారు. నేడు మోడీ బిజెపి ప్రభుత్వం పోరాడి సాధించుకున్న ఉపాధి హామీని రద్దు చేయడానికి అనేక కుట్రలు చేస్తుందని ఆ కుట్రలను నిరంతరం కూలీలను సమీకరించి తిప్పి కొడుతుందని తెలిపారు. గత మూడు సంవత్సరాల నుండి జిల్లా వ్యాప్తంగా వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన పోరాటాలను, ఉద్యమాలను సమీక్షించుకొని రానున్న కాలంలో వ్యవసాయ కార్మికుల, పేదల హక్కుల కోసం, వారి సంక్షేమం కోసం ఉద్యమాలు రూపొందించడానికి ఈ మహాసభలు నిర్వహిస్తున్నామని తెలిపారు. మహాసభల సందర్భంగా 18 వ తేదీన సాయంత్రం 5 గంటలకు వందలాది మందితో బహిరంగ సభ నిర్వహిస్తున్నామని ఈ బహిరంగ సభకు ముఖ్యఅతిథిగా అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి వెంకట్, మాజీ శాసనమండలి సభ్యులు చెరుపల్లి సీతారాములు, తెలంగాణ వ్యవసాయ కార్మిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ వెకట్రాములు, ఆవాజ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎండి జహంగీర్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు బొల్లు యాదగిరి పాల్గొని ప్రసంగిస్తారని తెలిపారు 18న నిర్వహించే బహిరంగ సభలో ఉపాధి హామీ కార్మికులు, వ్యవసాయ కూలీలు, పేదలు పెద్ద ఎత్తున పాల్గొనాలని, 19 నిర్వహించే ప్రతినిధుల మహాసభలో వ్యవసాయ కార్మిక సంఘం అన్ని మండలాలకు సంబంధించిన నాయకత్వం పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు, చీమలకొండూరు గ్రామ సర్పంచ్ పల్లెర్ల అంజయ్య, నాయకులు బోడ ఆంజనేయులు, పల్లెర్ల ఉప్పలయ్య, చంద్రయ్య, రచ్చ వెంకటేష్, నారికాడపు శంకర్, మాదాన్ జోజి, బల్థరాజు, కరికి మల్లేష్, రావుల నాగరాజు, కడగంచి సతీష్, మంగ సత్తయ్య, అంగడి భాస్కర్, పసుల మరిదాస్, డొమినిక్, అంతోని పాల్గొన్నారు.