జూలై 1న వీబీ జీ రాం జీ స్కీం ను రద్దు చేయాలని గ్రామీణ నిరసనలు
పాత పద్ధతిలోనే డెత్ కేసులు, ఉపాధి పనులు నిర్వహించాలి
సీఐటీయూ జిల్లా అధ్యక్షులు కోమటిరెడ్డి చంద్రారెడ్డి
మన తొలివెలుగు, యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో ప్రతినిధి జంగిటి రవీందర్ :
భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 30న ఎమ్మార్వో ఆఫీస్ ల ముందు ధర్నాలు, అదేవిధంగా జూలై 1 నుండి దేశవ్యాప్తంగా అమలు కానున్న వీబీ జీ రాం జీ స్కీమును రద్దు చేయాలని జరగనున్న గ్రామీణ నిరసనలను విజయవంతం చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షులు కోమటిరెడ్డి చంద్రారెడ్డి కార్మికులకు పిలుపునిచ్చారు. ఆదివారం స్థానిక సీఐటీయూ కార్యాలయంలో జరిగిన భవన నిర్మాణ కార్మికుల ముఖ్య కార్యకర్తల జిల్లా సమావేశంలో చంద్రారెడ్డి పాల్గొని మాట్లాడుతూ.. భవన నిర్మాణ కార్మికులకు సంబంధించిన సంక్షేమ బోర్డులో ఉన్న నిధులను రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు ఏజెన్సీల ద్వారా దుబారా ఖర్చు చేస్తుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సీఎస్సీ హెల్త్ కేర్ సెంటర్ ద్వారా చేసే హెల్త్ టెస్ట్ లను నిలుపుదల చేయాలని, 56 జీఓ సవరించి ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీల ద్వారా అమలు చేసే డెత్ కేసులను తిరిగి సంక్షేమ బోర్డు ద్వారానే అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పై డిమాండ్స్ తో పాటు భవన నిర్మాణ కార్మికులకు పెన్షన్లు, వ్యక్తిగత రుణాలు, పిల్లల చదువుల కోసం స్కాలర్షిప్ లు ఇవ్వాలని ఈనెల 30న ఎమ్మార్వో ఆఫీసుల ముందు చేసే ధర్నాలలో కార్మికుల అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దుచేసి జూలై 1 నుండి కొత్తగా తెచ్చిన వీబీ జీ రాం జీ స్కీంను దేశవ్యాప్తంగా అమలుకు పూనుకున్న నేపథ్యంలో సీఐటీయూ వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘాల ఆధ్వర్యంలో గ్రామీణ నిరసనలు చేయాలని అఖిల భారత కమిటీల పిలుపు మేరకు గ్రామీణ నిరసనలను జయప్రదం చేయాలని కార్మికులకు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు దాసరి పండు, మాయ కృష్ణ, భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు చీమకండ్ల శ్రీరాములు, గొరిగె సోములు, ఎస్ కే శీను, మారయ్య, ప్రసాద్, ఈశ్వర్, తూటి వెంకటేష్, లింగస్వామి, సోమయ్య, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.