ఉమ్మడి కుటుంబ వ్యవస్థను పటిష్టం చేద్దాం
జాగృతి అభ్యుదయ సంఘం ఛైర్మన్ భావన శ్రీనివాస్
వ్యాసరచన పోటీ విజేతలకు బహుమతుల ప్రధానం
మన తొలివెలుగు, సిటీబ్యూరో (07 ఆగస్ట్ 2026) :
ఉమ్మడి కుటుంబం- బంగారు కుటుంబమని, నేటి సమాజంలో ఉమ్మడి కుటుంబాలు అంతరించిపోతున్నాయని, ఉమ్మడి కుటుంబ వ్యవస్థను పటిష్టం చేయాల్సిన బాధ్యత సమాజంలో ప్రతి ఒక్కరిపై ఉందని జాగృతి అభ్యుదయ సంఘం ఛైర్మన్ భావన శ్రీనివాస్ అన్నారు. గత నెల 26వ తేదీ (ఆదివారం) తల్లిదండ్రుల దినోత్సవాన్ని పురస్కరించుకొని జాగృతి అభ్యుదయ సంఘం హయత్‌నగర్ మండలంలోని 11 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్ధులకు వ్యాసరచన పోటీలు నిర్వహంచింది. భారతదేశ సమగ్రత, సార్వభౌమత్వం కుటుంబ వ్యవస్థ పటిష్టతతోటే ముడిపడి ఉందనే ఉద్దేశంతో ఉమ్మడి కుటుంబాల అసరాన్ని ఉపయోగాలను వివరిస్తూ జాగృతి అభ్యుదయ సంఘం 8వ తరగతి విద్యార్థుల మధ్య వ్యాస రచన పోటీలు నిర్వహించింది. ఈ పోటీలలో మొత్తం 584 మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. విజేతలతో పాటు పోటీలలో పాల్గొన్న విద్యార్థులందరికీ ఈ నెల 7వ తేదీ (శుక్రవారం) జాగృతి అభ్యుదయ సంఘం ఛైర్మన్ భావన శ్రీనివాస్ ప్రోత్సాహక బహుమతులు అందజేశారు.

ఇంజాపూర్ అకడమిక్ హైట్స్ పబ్లిక్ స్కూల్, హయత్ నగర్, వనస్థలిపురం, సాహెబ్ నగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, వైదేహీ నగర్ లిటిల్ ఫ్లవర్ గ్రామర్ స్కూల్, విజయపురి కాలనీ శ్రీ నాగార్జున టాలెంట్ స్కూల్, సెల్ఫ్ ఫైనాన్స్ కాలనీ శ్రీ వికాస్ మోడల్ హైస్కూల్, వనస్థలిపురం నారాయణ కాన్సెప్ట్ స్కూల్, శ్రీనివాసపురం కాలనీ సెయింట్ ఆన్స్ హై స్కూల్, వనస్థలిపురం సిద్ధార్థ హై స్కూల్, ప్రశాంతి విద్యానికేతన్ హై స్కూల్ నుండి మొత్తం 33 మంది విజేతలను ఎంపిక చేసి బహుమతులు ఇవ్వటంతో పాటు ప్రోత్సహించిన పాఠశాలలకు జ్ఞాపికలు అందజేశారు.

ఈ సందర్భంగా భావన శ్రీనివాస్ మాట్లాడుతూ.. విద్యార్థులు ప్రతి ఒక్కరూ తన ఉన్నతికై తమ తల్లిదండ్రులు పడుతున్న కష్టాలు, శ్రమ, ఖర్చు గురించి, తిరిగి వారు పెరిగి ప్రయోజకులు అయ్యాక తమ తల్లిదండ్రుల రుణాన్ని ఏవిధంగా తీర్చుకుంటారో అనే అంశాలపై హృద్యంగా, కంటతడి పెట్టించే విధంగా చాలా చక్కగా వ్యాస రచనలు చేశారని కొనియాడారు. ఉమ్మడి కుటుంబాల వలన తోడు ఉన్నారనే ధైర్యం, సాధించగలమనే పట్టుదల, అనుభవం గడించిన పెద్దల ఆలోచనలు పంచుకోవడం, సర్దుకుపోవడం, ఐకమత్యం లాంటి అనేక ప్రయోజనాలతో పాటు ప్రకృతి వనరులు కూడా పరిమితంగా వాడబడతాయన్నారు. కాంక్రీట్ కట్టడాలు తగ్గుతాయని, పర్యావరణ కాలుష్యం కూడా నియంత్రించబడుతుందనే సదుద్దేశంతో ఈ మెగా ఈవెంట్ నిర్వహించామని అన్నారు. పాఠశాలల యజమాన్యాల కోరిక మేరకు ఈ పోటీలు ప్రతి సంవత్సరం నిర్వహించేందుకు ప్రయత్నిస్తామని భావన శ్రీనివాస్ తెలిపారు.

ఆయా పాఠశాలల యాజమాన్యాలు మాట్లాడుతూ.. కుటుంబ సభ్యుల మధ్య బంధాలు, అనుబంధాలు, సోదర భావంతో మెలగ వలసిన తోటి మనుషుల మధ్య కొరవడుతున్న మానవ సంబంధాలు, నేటి సమాజ పోకడలకు ఇలాంటి కార్యక్రమాలు చాలా ఉపయోగపడతాయని అభిప్రాయపడ్డారు. సమాజ మార్పు కోసం సత్ఫలితాలను ఇచ్చే జాగృతి అభ్యుదయ సంఘం ప్రతి కార్యక్రమానికి తమ వంతు ప్రోత్సాహం, సహాయ సహకారాలు ఉంటాయని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఆయా పాఠశాలల యాజమాన్యాలు, ప్రిన్సిపల్స్, ప్రధానోపాద్యాయులు అరుణ, రమాదేవి, నాగార్జున, దినేష్, స్వదేశీ, వెంకటేశ్వర రెడ్డి, సుధారాణి, భవాని, వసుంధర, వనజ, పార్వతి, విద్యా, వెంకట్రావు, శ్రీనివాస్ తదితరులతో పాటు జాగృతి ప్రతినిధులు శ్రీరంగనాధ్, ఆనబత్తుల సత్యనారాయణ, కె.వి రమణయ్య, వేమారెడ్డి తదితరులు, పాఠశాలల టీచర్లు, సిబ్బంది పాల్గొన్నారు.