MANA TOLIVELUGU
Newspaper Banner
Date of Publish : 25 May 2026, 8:45 pm Posted by : MANA TOLIVELUGU

ఎస్ఎన్డీపీ నాలా అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలి

వానాకాలంలో వరద నీటి సమస్య రాకుండా చర్యలు తీసుకోవాలి

మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య 

వానాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో ఎస్ఎన్డీపీ నాలా అభివృద్ధి పనులను అధికారులు త్వరగా పూర్తి చేసి వరద నీటి సమస్య లేకుండా చూడాలని జిల్లెలగూడా శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ధర్మకర్త, మాదారి రమేష్ కోరారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రా రెడ్డి ఆదేశాల మేరకు.. బడంగ్‌పేట్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని మీర్‌పేట్ 60వ డివిజన్‌లో జరుగుతున్న వ్యూహాత్మక నాలాల అభివృద్ధి కార్యక్రమం పనులను ఆయన మున్సిపల్ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ తనిఖీల్లో ఎస్ఎన్డీపీ డివిజనల్ ఇంజనీర్ శ్రవణ్ , బడంగ్‌పేట్ సర్కిల్ అసిస్టెంట్ ఇంజనీర్ సౌమ్య తో పాటు టౌన్ ప్లానింగ్ విభాగం నుండి ఏసీపీ కిరణ్ కుమార్, టీపీఓ దినేష్ పాల్గొని నాలా నిర్మాణ పురోగతిని, నిబంధనల అమలును క్షుణ్ణంగా పరిశీలించారు. ​ఈ సందర్భంగా మాదారి రమేష్ మాట్లాడుతూ.. స్థానిక ప్రజల వరద నీటి, డ్రైనేజీ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలనే సంకల్పంతో సబితా ఇంద్రారెడ్డి చొరవతో ఈ ప్రతిష్టాత్మక నాలా పనులు చేపట్టడం జరిగిందన్నారు. వర్షాకాలం సమీపిస్తున్న తరుణంలో కాలనీ వాసులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, టౌన్ ప్లానింగ్ ఇంజనీరింగ్ విభాగాలు సంయుక్తంగా పనులను మరింత వేగవంతం చేయాలని అధికారులను కోరారు. ​పనుల కాంట్రాక్ట్ సంస్థ అయిన మెగా ఇంజనీరింగ్ ప్రతినిధులు నాలా అభివృద్ధి పనుల నిర్మాణంలో ఎక్కడా రాజీ పడకుండా, ఖచ్చితమైన నాణ్యతా ప్రమాణాలు పాటించాలని సూచించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం పనులు జరగాలని, ఏమాత్రం అలసత్వం వహించినా సహించేది లేదని స్పష్టం చేశారు. స్థానిక కాలనీ వాసులకు ఇబ్బంది కలగకుండా త్వరితగతిన ఈ ప్రాజెక్టును పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు, కాంట్రాక్టర్‌కు సూచించారు.​ ఈ కార్యక్రమంలో స్థానిక డివిజన్ నాయకులు, కాలనీ ప్రతినిధులు మరియు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.