బడంగ్‌పేట్‌లో రెచ్చిపోతున్న కబ్జాదారులు
₹ 2 కోట్లకు పైగా విలువైన ప్రభుత్వ స్థలంపై కన్ను!
మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన
కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి రూ.10 లక్షల నిధుల కేటాయింపు
ఎమ్మెల్యే శంకుస్థాపన చేసిన శిలాఫలకం ధ్వంసం
మన తొలివెలుగు మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య (16 ఆగస్ట్ 2026) :
బడంగ్‌పేట్‌లో ప్రభుత్వ స్థలాలపై కబ్జాదారులు కన్నేశారు. ప్రజల అవసరాల కోసం కేటాయించిన కమ్యూనిటీ హాల్ స్థలాన్ని అక్రమంగా ఆక్రమించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సుమారు రూ.2 కోట్లకు పైగా విలువైన ఈ స్థలంలో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి గతంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి శంకుస్థాపన చేశారు. ఇందుకోసం రూ.10 లక్షల నిధులు సైతం కేటాయించారు.
అయితే తాజాగా ఎమ్మెల్యే శంకుస్థాపన చేసిన శిలాఫలకాన్ని ధ్వంసం చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రజా ప్రయోజనాల కోసం ఉద్దేశించిన స్థలంపై ఇలాంటి చర్యలు జరుగుతున్నా మున్సిపల్, రెవెన్యూ అధికారులు పట్టించుకోకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ స్థలాన్ని కాపాడాల్సిన అధికారులే చోద్యం చూస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి స్థలాన్ని రక్షించి, కబ్జా ప్రయత్నాలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.