MANA TOLIVELUGU
Newspaper Banner
Date of Publish : 29 July 2026, 7:23 pm Posted by : MANA TOLIVELUGU

కేంద్రం విద్యార్థులపై కక్ష సాధింపు చర్యలు మానుకోవాలి

సీపీఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం డిమాండ్

మన తొలివెలుగు యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి జంగిటి రవీందర్ (29 జులై 2026) :

ఢిల్లీ విద్యార్థులపై లాఠీచార్జ్ ప్రజాస్వామ్యంపై దాడి అని, ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థులపై కక్ష సాధింపు చర్యలను మానుకోవాలని, ఇలాంటి కక్ష సాధింపు చర్యలతో పరిపాలన చేయలేరని సీపీఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం అన్నారు. బుధవారం రాఘవేంద్ర కన్వెన్షన్ హాల్లో సీపీఐ యాదాద్రి భువనగిరి జిల్లా కౌన్సిల్ సమావేశం జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం.డీ ఇమ్రాన్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడుతూ.. దేశ విద్యా వ్యవస్థలో పారదర్శకతను కాపాడాల్సిన కేంద్ర ప్రభుత్వం అందులో విఫలమైందని ఆరోపించారు. నీట్ పరీక్షల నిర్వహణలో చోటుచేసుకున్న అవకతవకలు, ప్రశ్నపత్రాల లీకేజీలు లక్షలాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో తీవ్ర ఆందోళనకు కారణమయ్యాయని, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా పరీక్షల నిర్వహణలో పూర్తి పారదర్శకత, జవాబుదారీతనం ఉండే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఇటీవల ఢిల్లీలో తమ సమస్యల పరిష్కారం కోసం శాంతి యుతంగా ఆందోళన చేపట్టిన విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జ్ చేయడం సిగ్గుచేటు అన్నారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కును అణచివేయడం సరైన పద్ధతి కాదని, విద్యార్థుల సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందన్నారు. అయోధ్య రామ మందిరంలో భక్తులు సమర్పించిన విరాళాల నిర్వహణలో చోటు చేసుకున్న చోరీ ఆరోపణలపై బీజేపీ నాయకులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కోట్లాది మంది భక్తుల విశ్వాసానికి సంబంధించిన ఈ అంశంపై పూర్తి పారదర్శకతతో విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దేవాలయాల పేరుతో రాజకీయాలు చేసే వారు ఇలాంటి ఘటనలపై ఎందుకు మౌనం వహిస్తున్నారని ప్రశ్నించారు. దేశంలో పెరుగుతున్న నిరుద్యోగం, ధరల పెరుగుదల, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ, కార్మికులు, రైతులు, విద్యార్థుల సమస్యలను కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని విమర్శించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం సీపీఐ ఆధ్వర్యంలో ఉద్యమాలను మరింత ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సెప్టెంబర్ 8, 9, 10 తేదీలలో యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో జరగనున్న అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్ ) తెలంగాణ రాష్ట్ర 3వ మహాసభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర నలుమూలల నుంచి వేలాది మంది యువత ప్రతినిధులు హాజరుకానున్న ఈ మహాసభలను జిల్లా ప్రజలు, పార్టీ శ్రేణులు, యువత స్వాగతించి విజయవంతం చేయాలని కోరారు. యువత ఎదుర్కొంటున్న నిరుద్యోగం, విద్య, ఉపాధి, సామాజిక న్యాయం వంటి అంశాలపై ఈ మహాసభల్లో విస్తృతంగా చర్చించి భవిష్యత్ ఉద్యమ కార్యాచరణ రూపొందించనున్నట్లు తెలిపారు. సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం.డీ ఇమ్రాన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి యానాల దామోదర్ రెడ్డి, జిల్లా సహాయ కార్యదర్శులు బోలగాని సత్యనారాయణ, చేడే చంద్రయ్య, రాష్ట్ర సమితి సభ్యులు గోద శ్రీరాములు, కురిమిద్ద శ్రీనివాస్ జిల్లా కార్యవర్గ సభ్యులు కళ్లెం కృష్ణ, బండి జంగమ్మ, బచ్చనగోని గాలయ్య, చెక్క వెంకటేష్, పల్లె శేఖర్ రెడ్డి, చిగుళ్ల లింగం, కుసుమని హరిచంద్ర, యేశాల అశోక్, పెరబోయిన మహేందర్, జిల్లా సమితి సభ్యులు గాదెగాని మాణిక్యం, కళ్లేపల్లి మహేందర్, అన్నెపు వెంకట్, అన్నేమైన వెంకటేష్, దుబ్బాక భాస్కర్, మరుపాక వెంకటేష్, చౌడబోయిన కనకయ్య, దాసరి లక్ష్మయ్య, ఎల్లంకి మహేష్, బబ్బురి శ్రీధర్, కలకొండ సంజీవ, చిలివేరు అంజయ్య, ఆలేటి బాలరాజు, జెల్ది రాములు, ఇంజ హేమలత, వడ్లకొండ భారతమ్మ, అరే పుష్ప తదితరులు పాల్గొన్నారు.