గుంతలమయంగా మారిన బొయిగూడ, కందికల్ గేట్ ప్రధాన రహదారి
వాహనదారులు, స్థానికులకు తీవ్ర ఇబ్బందులు
మన తొలివెలుగు, చాంద్రాయణగుట్ట, ప్రతినిధి నార్కెట్‌పల్లి శైలేష్ కుమార్ :
పాతబస్తీలో రోడ్లు గుంతలమయంగా మారడంతో ప్రయాణం నరకప్రాయంగా మారింది. ముఖ్యంగా కందికల్ గేట్, బొయిగూడ ప్రధాన రహదారి గుంతల్లో వర్షపు నీరు నిలిచి వాహనదారులకు, స్థానికులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోంది. వర్షాల పడ్డ తర్వాత రోడ్డుపై ఏర్పడిన పెద్ద పెద్ద గుంతలు బురదమయంగా మారాయి. ద్విచక్ర వాహనదారులు గుంతల్లో అదుపు తప్పి కింద పడుతున్న ఘటనలు నిత్యం చోటు చేసుకుంటున్నాయి. బురదలో నుంచే తెగించి ప్రయాణించాల్సిన దుస్థితి ఏర్పడింది.

ఆటోలు, కార్లు, లారీలు నెమ్మదిగా కదలడంతో ట్రాఫిక్ జామ్ నిత్యకృత్యమైంది. గుంతల కారణంగా ప్రయాణం నరకప్రాయంగా మారిందని వాహనాదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జీహెచ్ఏంసీ అధికారులు తక్షణమే స్పందించి ఈ రహదారికి మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. లేకుంటే పెద్ద ప్రమాదాలు జరిగే ప్రమాదం ఉంది అని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే శాశ్వత మరమ్మత్తులు చేపట్టకపోతే జీహెచ్ఎంసీ సర్కిల్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరిస్తున్నారు.