మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య ముదిరాజ్ :
రాబోయే వర్షాకాలంలో గ్రామ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి, గ్రామ పరిశుభ్రత ఆరోగ్య పరిరక్షణకు సహకరించాలని, వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సర్పంచ్ హనుమతు నాయక్, ఉపసర్పంచ్ ఆర్. తేజ నాయక్ అన్నారు. దావూద్ గూడ గ్రామ పంచాయతీ కార్యాలయంలో రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని గ్రామ ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చర్యలపై అవగాహన కల్పించారు. వారి ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. నిల్వ నీరు ఉండకుండా చర్యలు తీసుకోవాలన్నారు. దోమల నివారణ కోసం దోమతెరలు వాడాలన్నారు. మురుగు కాలువలు, డ్రైనేజీలలో చెత్త వేయకుండా చూడాలన్నారు.
విద్యుత్ స్తంభాలు, వైర్లు దెబ్బతిన్నట్లయితే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. భారీ వర్షాల సమయంలో అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లకూడదన్నారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు, శిథిలావస్థలో ఉన్న ఇళ్లలో నివసించే వారు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని సూచించారు. తాగునీటిని మరిగించి వినియోగించాలని ప్రజలను కోరారు. చిన్నపిల్లలు, వృద్ధుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. గ్రామ ప్రజలందరూ వర్షాకాలంలో అప్రమత్తంగా ఉండి, గ్రామ పరిశుభ్రత ఆరోగ్య పరిరక్షణకు సహకరించాలని గ్రామ పంచాయతీ కోరారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు వి. రవీందర్ నాయక్, చిన్న నాయక్ కందుకూర్ ఏఈ సతీష్ రెడ్డి, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఏఈఓ జగతీష్, కందుకూర్ పోలీస్ డిపార్ట్మెంట్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.