మన తొలివెలుగు, మోత్కూర్ ప్రతినిధి పబ్బు ప్రవీణ్ :
యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మున్సిపాలిటీ కేంద్ర పరిధిలోని రాజన్నగూడెంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ఇందిరమ్మ ఇల్లు’ పథకం కింద నిర్మించుకున్న నూతన గృహప్రవేశ మహోత్సవం బుధవారం అత్యంత వైభవంగా జరిగింది. లబ్ధిదారులు పుచ్చకాయల మహేందర్ రెడ్డి- స్వాతి దంపతులు తమ నూతన గృహంలోకి శాస్త్రోక్తంగా ప్రవేశించారు. ఈ వేడుకకు స్థానిక తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామెల్ ముఖ్య అతిథిగా హాజరై, రిబ్బన్ కట్ చేసి గృహప్రవేశం చేయించారు. లబ్ధిదారులను ఆయన ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మందుల సామెల్ మాట్లాడుతూ.. పేదల సొంతింటి కలను సాకారం చేయడమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోందని కొనియాడారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా ప్రభుత్వం ముందుకు సాగుతుందని, నిరుపేదల ముఖాల్లో ఆనందం చూడటమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. స్వాతి-మహేందర్ రెడ్డి దంపతులు నూతన గృహంలో సంతోషంగా, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మోత్కూర్ మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం స్వప్న సోమనర్సయ్య, స్థానిక వార్డు కౌన్సిలర్లు, మోత్కూర్ మండల మరియు పట్టణ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, లబ్ధిదారుల కుటుంబ సభ్యులు, కాలనీవాసులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.