• నివాసాల మధ్య ఫ్యాక్టరీపై కాలనీవాసుల ఆగ్రహం
• అనుమతులపై అనుమానం, తీవ్ర ఆగ్రహం
• అగ్నిప్రమాద భయంతో స్థానికుల్లో ఆందోళన
• తక్షణ తనిఖీతో యూనిట్ నిలిపివేయాలని డిమాండ్
• నివాసల మధ్య పరిశ్రమకు ఎలా అనుమతులు ఇస్తారు.? అంటూ ప్రశ్నల వర్షం
మన తొలివెలుగు, బోయిన్ పల్లి ప్రతినిధి హబీబ్ :
ప్రజలు నివసించే ప్రాంతాల్లో పరిశ్రమలు, తయారీ యూనిట్లు నిర్వహించడంపై భద్రతా పరమైన ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఓల్డ్ బోయిన్‌పల్లి డివిజన్ పరిధిలోని మణికంఠ కాలనీలో నిర్వహిస్తున్న వాహనాల సీట్ కవర్లు, హెల్మెట్ల తయారీ యూనిట్‌పై సమగ్ర విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని కాలనీవాసులు డిమాండ్ చేస్తున్నారు. నివాస గృహాల మధ్యలోనే యూనిట్ కార్యకలాపాలు కొనసాగుతుండటంతో ప్రజల ప్రాణ, ఆస్తి భద్రతకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.
డిప్యూటీ కమిషనర్ కు ఫిర్యాదు
ఈ మేరకు గురువారం దాదాపు పది మంది కాలనీవాసులు కలిసి సికింద్రాబాద్‌లోని సర్కిల్–3 మున్సిపల్ కార్యాలయానికి వెళ్లి డిప్యూటీ కమిషనర్ డాకు నాయక్‌కు లిఖితపూర్వక ఫిర్యాదు అందజేశారు. ఫిర్యాదులో సదరు యూనిట్‌కు అవసరమైన అన్ని చట్టబద్ధ అనుమతులు, లైసెన్సులు, కాలుష్య నియంత్రణ అనుమతులు, అగ్నిమాపక భద్రతా అనుమతులు, ఇతర నిబంధనలు అమలులో ఉన్నాయా లేదా అనే విషయాన్ని పరిశీలించాలని కోరారు. కాలనీవాసులు మాట్లాడుతూ.. ప్రజలు అధిక సంఖ్యలో నివసించే ప్రాంతంలో యంత్రాలు, విద్యుత్ పరికరాలు, ముడి పదార్థాలతో కూడిన తయారీ కార్యకలాపాలు నిర్వహించడం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఏదైనా ప్రమాదం లేదా అగ్నిప్రమాదం సంభవిస్తే సమీపంలోని ఇళ్లకు, కుటుంబాలకు తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇటీవల నగరంలోని పలు ప్రాంతాల్లో చోటుచేసుకున్న అగ్నిప్రమాదాలు, పరిశ్రమలకు సంబంధించిన ప్రమాదాలను గుర్తు చేస్తూ, ప్రమాదం జరిగిన తర్వాత స్పందించడం కంటే ముందుగానే అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రజల భద్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని స్పష్టం చేశారు.

జనాభాసాల మధ్య అనుమతులు ఎలా..?
ఈ సందర్భంగా కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, విచారణలో అన్ని అనుమతులు ఉన్నాయని తేలినా, ప్రజలు నివసించే ప్రాంతాల్లో ఇలాంటి తయారీ యూనిట్లకు అనుమతులు ఎలా మంజూరు చేస్తున్నారు.? ప్రజల భద్రత కంటే అనుమతుల ప్రక్రియ ముఖ్యమా.? అని ప్రశ్నించారు. నివాస ప్రాంతాల మధ్య పరిశ్రమల తరహా కార్యకలాపాలకు అనుమతులు ఇచ్చే విధానంపై సంబంధిత శాఖలు స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఫిర్యాదును స్వీకరించిన డిప్యూటీ కమిషనర్ డాకు నాయక్ కాలనీవాసుల ఆందోళనలను శ్రద్ధగా విన్నారని, ఫిర్యాదులో పేర్కొన్న అంశాలపై బాధ్యతాయుతంగా విచారణ నిర్వహించి వాస్తవ పరిస్థితులను పరిశీలిస్తామని హామీ ఇచ్చినట్లు కాలనీవాసులు తెలిపారు. సంబంధిత శాఖలతో కలిసి క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించి అన్ని అనుమతులు, భద్రతా ప్రమాణాలు, భవన వినియోగ నిబంధనలు ఇతర చట్టపరమైన అంశాలను పరిశీలిస్తామని చెప్పినట్లు వెల్లడించారు. అయితే కాలనీవాసులు మాత్రం విచారణను త్వరితగతిన పూర్తి చేసి నివేదికను ప్రజలకు వెల్లడించాలని కోరారు. నిబంధనల ఉల్లంఘనలు, భద్రతా లోపాలు లేదా ప్రజల ప్రాణాలకు ముప్పు కలిగించే పరిస్థితులు ఉన్నట్లు తేలితే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అవసరమైతే యూనిట్ కార్యకలాపాలను నిలిపివేసి ప్రజల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. నివాసాల మధ్య ఫ్యాక్టరీ అనుమతులు ఎలా ఇస్తారు.? అనే ఈ అంశం ప్రస్తుతం ఓల్డ్ బోయిన్ పల్లి డివిజన్ లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. నివాస ప్రాంతాల్లో పరిశ్రమల నిర్వహణ, భద్రతా ప్రమాణాలు, అనుమతుల జారీ విధానంపై ప్రజలు ప్రశ్నలు లేవనెత్తుతుండగా, అధికారుల విచారణలో ఎలాంటి విషయాలు వెలుగులోకి వస్తాయోనన్న ఆసక్తి నెలకొంది. ప్రజల ప్రాణ, ఆస్తి భద్రతకు సంబంధించిన అంశం కావడంతో సంబంధిత శాఖలు పారదర్శకంగా, వేగవంతంగా విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని కాలనీవాసులు కోరుతున్నారు.