శరవేగంగా కొనసాగుతున్న నిర్మాణ పనులు
చోద్యం చూస్తున్న అధికారులు
మామూళ్ల మత్తులో సరూర్‌నగర్ సర్కిల్–12 అధికారులు ఉన్నారనే ఆరోపణలు
సీజ్ చేయకపోవడంపై స్థానికుల్లో అనుమానాలు
మన తొలివెలుగు | ఎల్బీనగర్:
ఎల్బీనగర్ జోన్ సరూర్ నగర్ సర్కిల్ పరిధిలో యదేచ్చగా అక్రమ నిర్మాణం శరవేగంగా కొనసాగుతుండటం చర్చనీయాంశంగా మారింది. సరూర్‌నగర్ సర్కిల్–12 పరిధిలోని చెరుకు తోట కాలనీలో, సంస్కృతి స్కూల్ సమీపంలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణ పనులు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.
కేవలం 150 చదరపు గజాల స్థలంలోనే బహుళ అంతస్తుల నిర్మాణం చేపడుతున్నట్లు తెలుస్తోంది. నిర్మాణంలో సెట్‌బ్యాక్ నిబంధనలు పాటించడం లేదని, ఫైర్ సేఫ్టీ ప్రమాణాలపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంత బహిరంగంగా నిర్మాణ పనులు జరుగుతున్నప్పటికీ సంబంధిత అధికారులు ఎందుకు స్పందించడం లేదనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
జోనల్ కమిషనర్ కార్యాలయానికి సమీపంలోనే అక్రమ నిర్మాణం కొనసాగుతున్నా అధికారులు పట్టించుకోకపోవడం పట్ల స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. సరూర్‌నగర్ సర్కిల్–12 డిప్యూటీ కమిషనర్, టౌన్ ప్లానింగ్ అధికారులు నిర్మాణాన్ని అడ్డుకోవడంతో పాటు సీజ్ చేయాల్సి ఉన్నప్పటికీ ఇప్పటివరకు చర్యలు లేకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అక్రమ నిర్మాణం పూర్తయిన తర్వాత చర్యలు తీసుకుంటారా.. లేక ఇప్పుడే అడ్డుకుంటారా? అనే ప్రశ్నలు స్థానికుల నుంచి వినిపిస్తున్నాయి. నిర్మాణానికి అనుమతులు ఉన్నాయా? నిబంధనలకు అనుగుణంగా ప్లాన్ మంజూరైందా? సెట్‌బ్యాక్, ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటిస్తున్నారా? అనే అంశాలపై అధికారులు స్పష్టత ఇవ్వాలని స్థానికులు కోరుతున్నారు.
ఏదైనా ప్రమాదం చోటుచేసుకుని ప్రాణ, ఆస్తి నష్టం సంభవిస్తే బాధ్యత ఎవరిదనే ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. ఈ నిర్మాణంపై తక్షణమే తనిఖీ నిర్వహించి, నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే మున్సిపల్ చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
అక్రమ నిర్మాణంపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.