ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో తాటి చెట్టు కూలడంతో ఘటన
మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య ముదిరాజ్ :
బలమైన ఈదురుగాళ్లకు తాటి చెట్టు కూలి ఓ ఇంటిపై పడడంతో ఆ ఇంటిలో నిద్రిస్తున్న ఓ మహిళ తీవ్ర గాయాల పాలై చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన మీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాఘవేంద్ర నగర్ కాలనీలో భారీ ఈదురుగాలులకు తాటి చెట్టు కూలిపడి ఓ మహిళ మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. సభావత్ లక్ష్మి తన కుమారుడు వెంకట్ రామ్, కోడలు లలితతో కలిసి లలితా నగర్ లోని రాఘవేంద్ర నగర్ కాలనీలోని ఓ రేకుల ఇంట్లో అద్దెకు నివాసం ఉంటున్నారు. వీరంతా వికలాంగులేనని స్థానికులు తెలిపారు. శుక్రవారం రాత్రి సుమారు 10.30 గంటల సమయంలో బలమైన ఈదురుగాలులు వీచడంతో ఇంటి పక్కనే ఉన్న తాటి చెట్టు ఒక్కసారిగా కూలి, ఇంట్లో నిద్రిస్తున్న సబావత్ లక్ష్మి (75) కుటుంబ సభ్యులపై పడింది.

ఈ ప్రమాదంలో ముగ్గురూ తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే వారిని ఆస్పత్రికి తరలించారు. తీవ్ర గాయాలపాలైన సభావత్ లక్ష్మిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందించగా, చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. కుమారుడు వెంకట్ రామ్, కోడలు లలిత స్వల్ప గాయాలతో బయటపడ్డారు. చెట్టు కూలి గోడపై పడి మధ్యలో విరిగింది. మధ్యలో ఇరగకపోతే మహిళ మృతి చెందేది కాదని, ఆమె కుటుంబ సభ్యులకు ఎటువంటి గాయాలు కాకపోయేవని, సురక్షితంగా బయటపడేవారని స్థానికులు తెలిపారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.