MANA TOLIVELUGU
Newspaper Banner
Date of Publish : 08 June 2026, 8:46 pm Posted by : MANA TOLIVELUGU

తాళం వేసిన ఇండ్లే టార్గెట్

భారీ దొంగతనం కేసు చేదించిన పోలీసులు

అద్భుత ప్రతిభ కనబరిచిన పహాడీషరీఫ్ పోలీసులను అభినందించిన డీసీపీ 

కేవలం దొంగతనం జరిగిన రెండు రోజుల్లోనే నిందితుడి అరెస్ట్

రూ. 26 లక్షల విలువైన బంగారం, వెండి రికవరీ

మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య ముదిరాజ్ :

పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఒక భారీ ఇండ్ల దొంగతనం కేసులో సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్ పరిధిలోని పహాడీషరీఫ్ పోలీసులు అద్భుత ప్రతిభను కనబరిచారు. పోలీస్ స్టేషన్ పరిధిలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఈ నెల 5న ఫిర్యాదు దారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైన కేవలం 2 రోజుల్లోనే నిందితుడిని అత్యంత చాకచక్యంగా అదుపులోకి తీసుకుని, అతని వద్ద నుండి సుమారు రూ. 26 లక్షల విలువైన చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తులో లభించిన సాంకేతిక ఆధారాలు, విశ్వసనీయ సమాచారం మేరకు ఈ నెల 7 న సాయంత్రం పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ క్రైమ్ విభాగం సిబ్బంది ఈ దొంగతనానికి పాల్పడిన అంతర్ జిల్లా నేరస్థుడిని అరెస్ట్ చేశారు. అతని వద్ద నుండి 166 గ్రాముల బంగారు ఆభరణాలు, 257 గ్రాముల వెండి వస్తువులు, తాళాలు పగలగొట్టడానికి ఉపయోగించిన ఒక స్క్రూడ్రైవర్‌ను రికవరీ చేశారు. నిందితుడి ఆకుమల్ల బాబా పీర్ అలియాస్ బాబా (20), ఏసీ మెకానిక్ గా పనిచేస్తున్నాడు. అయ్యవారిపల్లి గ్రామం, చాపాడు మండలం, వైఎస్ఆర్ కడప జిల్లాకు చెందిన ఇతను హౌసింగ్ బోర్డ్ కాలనీ, రావిర్యాల గ్రామంలో నివాసం ఉంటున్నాడు. నిందితుడు బాబా పీర్ రాత్రి సమయాల్లో నివాస కాలనీలలో తిరుగుతూ, తాళాలు వేసి ఉన్న ఇళ్లను, ప్రజల కదలికలను నిశితంగా గమనిస్తాడు. ఇళ్లలో ఎవరూ లేరని నిర్ధారించుకున్నాక, పూజ గది లేదా ఇతర గదుల వెంటిలేషన్ గ్లాస్ పలకలను తొలగించి లోపలికి ప్రవేశించి. తన వెంట తెచ్చుకున్న స్క్రూడ్రైవర్ సహాయంతో బెడ్‌రూమ్‌లోని అల్మారాల తాళాలు, లాకర్లను పగలగొట్టి, అందులోని బంగారం, వెండి ఆభరణాలను దొంగిలించి పరారయ్యేవాడు. అలా దొంగిలించిన సొత్తును హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో తెలియని వ్యక్తులకు విక్రయించి, వచ్చిన డబ్బును తన జల్సాలకు, వ్యక్తిగత ఖర్చులకు ఉపయోగించేవాడు. ఆర్జీఐఏ డివిజన్ ఏసీపీ వి. శ్రీకాంత్ గౌడ్ పర్యవేక్షణలో, పహాడీషరీఫ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ బి. లక్ష్మీనారాయణ రెడ్డి, డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ డి. డెబోరా, సబ్-ఇన్‌స్పెక్టర్ ఎండి. ఫైసల్ అహ్మద్, హెడ్ కానిస్టేబుళ్లు శ్రీరాములు, శేఖర్ బాబు, కానిస్టేబుళ్లు వై. విజయ్ కుమార్ రెడ్డి, మహేష్, ఎం.డి. ఖాలేద్, పరశురామ్‌లతో కూడిన బృందం అత్యంత వేగంగా స్పందించి నిందితుడిని అరెస్ట్ చేసి, సొత్తును రికవరీ చేసింది. కేసును కేవలం రెండు రోజుల్లోనే ఛేదించి, వంద శాతం రికవరీ సాధించిన పహాడీషరీఫ్ పోలీస్ బృందాన్ని శంషాబాద్ జోన్ డీసీపీ ప్రత్యేకంగా అభినందించారు. ఈ బృందానికి తగిన రివార్డులను అందజేయనున్నట్లు ప్రకటించారు.