నిందితులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలి
రాష్ట్ర వ్యాప్తంగా దళితులు, గిరిజనులపై జరుగుతున్న దాడులను అరికట్టాలి
తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొండమడుగు నర్సింహ
మన తొలివెలుగు, యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి జంగిటి రవీందర్ (04 అక్టోబర్ 2026) :
నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం పీ.కే. మల్లెపల్లి గ్రామంలో గ్రామసభ సందర్భంగా దళిత మహిళ వీఓఏ గనిపల్లి మాధవిపై జరిగిన దాడిని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నామని జిల్లా ప్రధాన కార్యదర్శి కొండమడుగు నర్సింహ ఒక ప్రకటనలో తెలిపారు. గ్రామసభలో బహిరంగంగా దాడి చేయడంతో పాటు కులం పేరుతో దూషించిన నిందితులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేసి, చట్టపరంగా కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. బాధిత దళిత మహిళకు తక్షణ రక్షణ కల్పించి, ఆమెకు న్యాయం జరిగేలా పోలీసు అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. రోజురోజుకూ దేశంలో, రాష్ట్రంలో దళితులు, దళిత మహిళలు, గిరిజనులపై దాడులు, హత్యలు, అత్యాచారాలు కొనసాగుతుండటం ఆందోళనకరమని నర్సింహ అన్నారు. నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా దళితులపై 2020 నుండి 2024 వరకు 2,72,260 దాడలు, హత్యలు, అత్యాచారాలు జరిగాయని గిరిజనులపై 2020 నుండి 2024 వరకు 50,064 దాడులు, హత్యలు, అత్యాచారాలు జరిగాయని తెలిపారు. ప్రతి సంవత్సరం దళితులు, గిరిజనులపై వేల సంఖ్యలో నేరాలు నమోదవుతున్న పరిస్థితి కొనసాగిందని ఆవేదన వెలిబుచ్చారు. ముఖ్యంగా దళితులపై నమోదైన నేరాల్లో హత్యలు, అత్యాచారాలు, గాయపరచడం, మహిళలపై దాడులు, బెదిరింపులు, కులపరమైన అవమానాలు వంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయని ఆయన పేర్కొన్నారు. తెలంగాణలో కూడా పరిస్థితి ఆందోళనకరంగానే ఉందని నర్సింహ అన్నారు. నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో ప్రకారం తెలంగాణలో దళితులపై 5555 దాడులు జరిగాయని తెలిపారు. ఇది రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న నేరాలను అరికట్టడంలో ప్రభుత్వ యంత్రాంగం మరింత కఠినంగా వ్యవహరించాల్సిన అవసరాన్ని తెలియజేస్తోందన్నారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 సమానత్వ హక్కును, ఆర్టికల్ 17 అంటరానితనం నిర్మూలనను హామీ ఇస్తున్నప్పటికీ, నేటికీ దళితులు అనేక రంగాల్లో వివక్షకు గురవుతున్నారని నర్సింహ ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం, పౌర హక్కుల పరిరక్షణ చట్టం వంటి చట్టాలు ఉన్నప్పటికీ వాటిని సమర్థవంతంగా అమలు చేయకపోవడం వల్ల బాధితులకు సకాలంలో న్యాయం అందడం లేదన్నారు. గ్రామసభలు ప్రజాస్వామ్యబద్ధంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించాల్సి ఉండగా, ఒక మహిళా ఉద్యోగిని కులపరంగా అవమానించడం, అసభ్య పదజాలంతో దూషించడం, బహిరంగంగా దాడికి పాల్పడటం అత్యంత దురదృష్టకరమన్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో కూడా వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో అధికారులు తక్షణమే స్పందించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి, నిందితులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంతో పాటు వర్తించే ఇతర చట్టాల కింద కేసులు నమోదు చేసి, వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని నర్సింహ డిమాండ్ చేశారు. బాధితురాలికి రక్షణ కల్పించడంతో పాటు, నష్టపరిహారం మరియు న్యాయ సహాయం అందించాలని కోరారు. దేశంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత దళితులు, గిరిజనులు, మహిళలపై జరుగుతున్న అనేక దాడుల నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. దళితులు, గిరిజనులపై జరిగే దాడులను అరికట్టేందుకు అన్ని వర్గాల ప్రజలు ఐక్యంగా పోరాడాలని వారు పిలుపునిచ్చారు. పౌర హక్కుల దినోత్సవాన్ని గ్రామగ్రామాన విస్తృతంగా నిర్వహించి, దళితులు, గిరిజనులకు రాజ్యాంగం కల్పించిన హక్కులు, చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు కుల వివక్షకు వ్యతిరేకంగా ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని నర్సింహ సూచించారు.