MANA TOLIVELUGU
Newspaper Banner
Date of Publish : 28 April 2026, 10:21 am Posted by : MANA TOLIVELUGU

దేశంలోనే తెలంగాణను అగ్రగామిగా నిలిపిన తెలంగాణ ఉద్యమ నేత మాజీ సీఎం సీఎం కేసీఆర్

4 కోట్ల ప్రజల గొంతుకులను ఏకం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ధీరుడు కేసీఆర్

మన తొలివెలుగు, మహేశ్వరం, ప్రతినిధి ముత్తయ్య

దేశంలోనే తెలంగాణను అగ్రగామిగా నిలిపిన మాజీ సీఎం కేసీఆర్ , తెలంగాణకు గుండె చప్పుడు అయ్యాడని ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన గొప్ప వ్యక్తి కేసీఆర్ అని బీఆర్ఎస్ పార్టీ ఫౌండర్, రాష్ట్ర నాయకుడు, మధిర నియోజకవర్గ మాజీ ఇంచార్జ్ బొమ్మెర రామ్మూర్తి అన్నారు. బీఆర్ఎస్ పార్టీ రజితోత్సవ కార్యక్రమంలో భాగంగా ఆయన కేసీఆర్ ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

అనంతరం తెలంగాణ భవన్ లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గులాబీ ఆవిర్భావ పండుగ తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీకగా 2001లో జలదృశ్యంలో బీఆర్‌ఎస్‌ పురుడు పోసుకున్నదన్నారు. 25 ఏండ్ల ప్రయాణంలో అనేక ఒడిదుడుకులను తట్టుకొని నిలబడ్డదన్నారు. కేసీఆర్‌ నాయకత్వంలో 14 ఏండ్ల అలుపెరుగని పోరాటంతో 60 ఏండ్ల స్వరాష్ట్ర స్వప్నాన్ని సాకారం చేసి సరికొత్త చరిత్ర లిఖించిందన్నారు. బీఆర్‌ఎస్‌.. ఆత్మగౌరవ ప్రతీక.. ప్రజాఉద్యమ పతాక. ఆరు దశాబ్దాల అన్యాయం, అణచివేయబడిన ఆకాంక్షల మధ్య 2001లో జలదృశ్యంలో పురుడుపోసుకున్న గులాబీ జెండా.. పాతికేండ్ల ప్రస్థానంలో అనేక ఒడిదుడుకులను తట్టుకొని నిలబడిందన్నారు. పోరాటంలో నైనా, పాలనలోనైనా తన పటిమను చూపిందన్నారు. అగాధాలు, అడ్డంకులు ఎన్ని ఎదురైనా.. ఆ పతాకం తలవంచలేదని తెలిపారు. ఎత్తిన పిడికిలి సడలనివ్వలేదు. అందుకే గులాబీ జెండా ప్రజలకు ఓ గుండె ధైర్యం తెలంగాణకు ఓ భరోసా అయిందన్నారు. బీఆర్ఎస్ పార్టీ 25 వసంతాల మైలురాయిని అధిగమించిన మహోజ్వల లాంగ్ మార్చ్ అని తెలిపారు. 4 కోట్ల గొంతులను ఏకం చేసి విప్లవ శంఖం మోగించిన ధిక్కార వేదిక అని తెలిపారు. సమైక్య సంకెళ్లను తెంచి స్వరాష్ట్ర కాంక్షను సాకారం చేసిన యుద్ధ గీతిక, పదేళ్ల పాలనతో ఉద్యమ తెలంగాణను ఉజ్వల తెలంగాణగా తీర్చిదిద్దిన అభివృద్ధి పతాక, తెలంగాణ జాతి ఆత్మగౌరవ ఖ్యాతిని ప్రపంచానికి చాటిన గులాబీ దీపిక, ప్రజల విశ్వాసానికి ప్రతీక అయిందన్నారు. పాపపు పాలనలో ప్రజల జీవితాలు నలిగిపోతున్న వేళ, ప్రజల గుండెల్లో ‘రేవంత్ పోవాలి, కేసీఆర్ రావాలి’ అనే నినాదం మార్మోగుతుందని పేర్కొన్నారు. సంక్షేమం అడుగంటి, అభివృద్ధి నిలిచిపోయి, అరాచకం తాండవం చేస్తున్న కాలంలో అదే నినాదం వినిపిస్తోందని అన్నారు. ఉద్యమంలోనైనా, అధికారంలోనైనా, ప్రతిపక్షంలోనైనా ఎప్పుడూ ప్రజల పక్షానే నిలబడి, తెలంగాణను కంటికి రెప్పలా కాపాడుకున్న పార్టీ మన బీఆర్ఎస్ మాత్రమేనని పేర్కొన్నారు. పోరాటాల పునాది మీద పుట్టి, ప్రజల విశ్వాసంతో ఎదిగి, ప్రతి గుండెలో నాటుకుపోయిన గులాబీ శక్తియే బీఆర్ఎస్ అన్నారు. గులాబీ జెండా సగర్వంగా ఎగిరే రోజు ఎంతో దూరంలో లేదని తెలిపారు. నిలిచిపోయిన తెలంగాణ ప్రగతి రథం మళ్లీ పరుగులు తీసే రోజు ఎంతో దూరంలో లేదని పేర్కొన్నారు బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మధిర నియోజకవర్గ ప్రజలకు, పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, సోషల్ మీడియా వారియర్లకు, అభిమానులకు, ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు.