మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య
పండించిన పంటను అమ్ముకోవడానికి అన్నదాతలు పడిగాపులు కాస్తున్నా, సంబంధిత ప్రభుత్వ యంత్రాంగం పట్టించుకోకపోవడం అత్యంత దురదృష్టకరమని రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ ఛైర్మన్, తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) పార్టీ నాయకులు కప్పాటి పాండురంగా రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల పక్షపాతి అని గొప్పలు చెప్పుకుంటున్నా, క్షేత్రస్థాయిలో ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద పరిస్థితి మాత్రం దారుణంగా ఉన్న సందర్భంగా ఆయన కందుకూరు మండల కేంద్రంలో మాట్లాడుతూ.. జిల్లాలోని పలు మండలాల్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకు రైతులు తమ ధాన్యాన్ని తరలించిన 50% కూడా కొనుగోలు చేయలేదని, ప్రభుత్వం నిర్ణయించిన నాణ్యతా ప్రమాణాల పేరుతో, ఆరబెట్టిన ధాన్యంపై కూడా ‘తేమ ఎక్కువ ఉంది’ అని సాకు చెబుతూ క్వింటాలుకు 5 నుండి 8 కిలోల వరకు తరుగు తీస్తూ రైతులను దోచుకుంటున్నారని తెలిపారు. కొనుగోలు కేంద్రాల వద్ద కనీసం త్రాగునీరు, నీడ లేక రైతులు, కూలీలు తీవ్ర అవస్థలు పడుతున్నారన్నారు. అకాల వర్షాల భయంతో ధాన్యం తడవకుండా ఉండేందుకు టార్పాలిన్లు కూడా అందుబాటులో లేవన్నారు. ఒకవేళ ధాన్యం విక్రయించినా, రైతు ఖాతాల్లోకి డబ్బులు ఎప్పుడు జమవుతాయో తెలియని అయోమయ స్థితి నెలకొందన్నారు. దీనివల్ల తదుపరి సాగుకు పెట్టుబడి కోసం రైతులు ప్రైవేట్ వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం సన్న రకం వరిని పండించే రైతులకు క్వింటాకు రూ. 500 అదనపు బోనస్ రైతుల బ్యాంకు ఖాతాల్లో త్వరగా జమ చేయాలని అన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా మొద్దునిద్ర వీడి, అవసరమైనంత మేర గన్నీ బ్యాగులు అందించాలి. తేమ శాతం పేరుతో రైతులను వేధించే మిల్లర్లు, అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. అన్నదాతల కష్టాలను గుర్తించి ధాన్యం కొనుగోలును యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రైతుల పక్షాన ఆందోళనలను తీవ్రతరం చేస్తామని కప్పాటి పాండురంగారెడ్డి హెచ్చరించారు.