MANA TOLIVELUGU
Newspaper Banner
Date of Publish : 17 May 2026, 9:36 pm Posted by : MANA TOLIVELUGU

నడుములు విరగొట్టే గుంతలు.. యమ డేంజర్ గా మారిన రహదారి

రోడ్లు గుంతలు పడ్డ ఎవరు పట్టించుకోరు.. మా బాధ ఎవరికి చెప్పుకోవాలి – స్థానిక ప్రజలు

మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య 

జల్ పల్లి సర్కిల్ పరిధి కేంద్రంలోని జల్ పల్లి, శ్రీరామ కాలనీ చౌరస్తా నుంచి లక్ష్మీ గూడ మైలార్ దేవ్ పల్లి కి వెళ్లే రూట్ లో ప్రెస్ కాలనీ వద్ద ప్రధాన రహదారి, అధ్వానంగా రోడ్డు ఉండడంతో పాదాచారులకు తిప్పలు తప్పడం లేదు. లెక్కలేనన్ని గోతులపై గతిలేక ప్రయాణం సాగిస్తున్న వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. ద్విచక్ర వాహనదారులకు నడుములు విరిగిపోయే ప్రమాదం పొంచి ఉంది. గుంతలమయమైన రహదారులు ప్రజలకు, వాహనదారులకు నరకం చూపిస్తున్నాయి. గుంతలు పడ్డ రోడ్లకు మరమ్మత్తులు చేయకపోవడంతో అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఈ రహదారిపై ప్రయాణించాలంటే వాహనదారులు వనికి పోతున్నారు. వామ్మో ఇదేం రహదారి అని భయపడిపోతున్నారు. ఇదే ప్రధాన రహదారి కావడంతో గత్యంతరం లేక ప్రయాణం సాగిస్తున్నామని వాహన దారులు అంటున్నారు. వాహనదారులు నానా ఇబ్బందులు పడుతూ ప్రమాదాల బారిన పడుతున్నారు. అధ్వాన్నమైన రోడ్లపై ప్రయాణిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని వాపోతున్నారు.

రహదారి సమీపంలోని ఓ ఇంటి నుంచి నిరంతరం మురుగునీరు రహదారిపై రావడంతో రహదారి చెరువులా తయారయింది. రోడ్లు గుంతలు పడ్డ ఎవరు పట్టించుకోరు.. మా బాధ ఎవరికి చెప్పుకోవాలని నిత్యం ఈ రహదారిపై రాకపోకలు సాగించే జల్ పల్లి, శ్రీరామ కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జల్ పల్లి సర్కిల్ కమిషనర్ వెంకట్రావు, అధికారులు ఈ రహదారిపై దృష్టి సారించి మరమ్మత్తులు చేయించి, చర్యలు తీసుకుని ప్రయాణం సాఫీగా సాగేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఇంట్లో నుంచి వస్తున్న మురుగునీరుతో గుంతలు ఎక్కువగా తయారై సమస్య జఠిలమవుతుందని, అట్టి ఇంటి పై చర్యలు తీసుకుని అధికారులు భారీగా జరిమానా విధించాలని స్థానికులు కోరుతున్నారు.