MANA TOLIVELUGU
Newspaper Banner
Date of Publish : 19 May 2026, 9:54 pm Posted by : MANA TOLIVELUGU

పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి సామాన్యుడిపై భారం మోపడం సరికాదు

మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య 

అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల పెరుగుదలను సాకుగా చూపుతూ, చమురు సంస్థలు సామాన్యుడిపై మరోసారి ధరల భారాన్ని మోపడం అత్యంత బాధాకరం. ఐదు రోజుల వ్యవధిలోనే రెండోసారి పెట్రోల్, డీజిల్ ధరలను పెంచడంపై రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ ఛైర్మన్ కప్పాటి పాండురంగారెడ్డి తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ​ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత శుక్రవారం (మే 15) లీటరుకు రూ. 3 పెంచిన చమురు సంస్థలు, ఆ గాయం మానక ముందే నేడు మరోసారి లీటరుకు సుమారు రూపాయి వరకు పెంచడం దారుణమన్నారు. తాజా పెంపుతో హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 111.88కి చేరింది. జిల్లాల్లో రవాణా ఖర్చుల వల్ల ధరలు మరింత భారంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గినప్పుడు ఆ ప్రయోజనాన్ని సామాన్యులకు అందించని కంపెనీలు, ధరలు పెరిగినప్పుడు మాత్రం వెంటనే భారాన్ని వినియోగదారులపై నెట్టేయడం శోచనీయమన్నారు.

​పెట్రోల్, డీజిల్ ధరల పెంపు వల్ల రవాణా ఖర్చులు పెరిగి, చివరికి నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకే ప్రమాదం ఉందన్నారు. ఇది మధ్యతరగతి, పేద ప్రజల బడ్జెట్‌పై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. ​ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ప్రేక్షకపాత్ర వహించకుండా, తక్షణమే స్పందించాలి. పెట్రో ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకాలు, వ్యాట్ తగ్గించి సామాన్యులకు ఉపశమనం కల్పించాలని కప్పాటి పాండురంగా రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ​చమురు సంస్థలు తమ లాభాల కోసం ప్రజల నడ్డి విరుస్తున్నాయని, ఇప్పటికైనా ధరల పెంపును నిలిపివేయాలని ఆయన హెచ్చరించారు.