జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి
మన తొలివెలుగు, యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో ప్రతినిధి జంగిటి రవీందర్ :
భువనగిరి జిల్లాలో పొగాకు నియంత్రణ చర్యలను మరింత సమర్థవంతంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం మే 31న నిర్వహించే ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా జిల్లాలో అన్ని శాఖల సమన్వయంతో విస్తృత స్థాయిలో అవగాహన, అమలు, తనిఖీ కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. పోలీస్, మున్సిపల్, విద్య, వైద్య ఆరోగ్య శాఖలు సమన్వయంతో ప్రత్యేక తనిఖీలు నిర్వహించి, ప్రజా ప్రదేశాలు, బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు, మార్కెట్లు, విద్యాసంస్థల పరిసరాల్లో చట్ట ఉల్లంఘనలకు పాల్పడే వారిపై చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాను పూర్తిస్థాయిలో పొగాకు రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు అన్ని ప్రభుత్వ శాఖలు, స్వచ్ఛంద సంస్థలు, విద్యాసంస్థలు, ప్రజలు సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. అదనపు కలెక్టర్ భాస్కర్ రావు మాట్లాడుతూ.. జిల్లాలో పొగాకు వినియోగం వల్ల కలిగే ఆరోగ్య సమస్యలపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు ర్యాలీలు, వాక్‌థాన్‌లు, ఐఈసీ కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ లక్ష్మీనారాయణ, జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి ఎం. మనోహర్, జిల్లా అగ్నిమాపక అధికారి మధుసూదన్ రావు, డా. వీణ, ఐ. పద్మ, జి. ఇస్తారి, జిల్లాలోని అనుబంధ శాఖల అధికారులు పాల్గొన్నారు.