సీపీఐ జిల్లా కార్యదర్శి యానాల దామోదర్ రెడ్డి
కలెక్టరేట్ ఎదుట సీపీఐ ధర్నా
మన తొలివెలుగు, యాదాద్రి భువనగిరి టౌన్ ప్రతినిధి జంగిటి రవీందర్ :
యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రజా పాలనలో ఇందిరమ్మ ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్క కుటుంబానికి ప్రభుత్వం ఇండ్లు మంజూరు చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి యానాల దామోదర్ రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం సీపీఐ రాష్ట్ర సమితి ఇచ్చిన పిలుపులో భాగంగా జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు వందలాది మందితో ధర్నా నిర్వహించిన అనంతరం జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతికి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్బంగా దామోదర్ రెడ్డి మాట్లాడుతూ.. యాదాద్రి భువనగిరి జిల్లాలో మొత్తం 1,97,282 మంది ఇందిరమ్మ ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకోగా, మొదటి విడతలో కేవలం 9,618 మందికి మాత్రమే ఇండ్లు మంజూరయ్యాయని, ఇంకా లక్షా ఎనభై వేల మందికి పైగా దరఖాస్తుదారులు ఇళ్ల కోసం ఎదురుచూస్తున్నారని, జిల్లాలో వేలాది మంది పేదలు ఇప్పటికీ అద్దె ఇళ్లలో, తాత్కాలిక గుడిసెల్లో, శిథిలావస్థలో ఉన్న ఇళ్లలో నివసిస్తూ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. సొంత ఇల్లు లేకపోవడం వల్ల పేద కుటుంబాలు సామాజిక, ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని, పిల్లల విద్య, మహిళల భద్రత, కుటుంబాల జీవన ప్రమాణాలపై ప్రతికూల ప్రభావం పడుతోందన్నారు. ప్రభుత్వం ప్రకటించిన ఇందిరమ్మ ఇండ్ల పథకం నిజమైన పేదలకు వరంగా మారాలంటే కేవలం ఒక విడతతో సరిపెట్టకుండా, దరఖాస్తు చేసుకున్న ప్రతి కుటుంబానికి ఇండ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఎంపిక ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా నిర్వహించాలని, అర్హులెవరూ అన్యాయానికి గురికాకుండా చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా సొంత ఇంటి స్థలం లేని నిరుపేదలకు ఇంటి స్థలాలు కేటాయించాలని, ప్రభుత్వ భూములపై ఎన్నో సంవత్సరాలుగా నివాసం ఉంటున్న పేదలకు ఇంటి పట్టాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. దళితులు, గిరిజనులు, బీసీలు, మైనార్టీలు, వికలాంగులు, ఒంటరి మహిళలు, ఇతర బలహీన వర్గాలకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి అవసరమైన నిధులను సకాలంలో విడుదల చేసి, నిర్మాణ పనులను వేగవంతం చేయాలని, అర్హుల జాబితాను గ్రామాలు, మున్సిపాలిటీల వారీగా బహిరంగంగా ప్రకటించి ప్రజలకు పూర్తి సమాచారం అందించాలని డిమాండ్ చేశారు. జిల్లాలో గృహ సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందించి, ఇందిరమ్మ ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకున్న ప్రతి కుటుంబానికి ఇండ్లు, ఇంటి స్థలం, ఇంటి పట్టా కల్పించే వరకు సీపీఐ ప్రజల తరఫున నిరంతరం పోరాటం కొనసాగిస్తుందని అయన స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి బోలగాని సత్యనారాయణ, జిల్లా కార్యవర్గ సభ్యులు గోద శ్రీరాములు, కళ్లెం కృష్ణ, ఎండి ఇమ్రాన్, చెక్క వెంకటేష్, బచ్చనగోని గాలయ్య, పెరబోయిన మహేందర్, చిగుర్ల లింగం, ఏశాల అశోక్, ఉప్పల ముత్యాలు, కురిమిద్ద శ్రీనివాస్, పల్లె శేఖర్ రెడ్డి, కొల్లూరి రాజయ్య జిల్లా సమితి సభ్యులు దుబ్బాక భాస్కర్, అన్నేమైన వెంకటేష్ గాదేగాని మాణిక్యం, కల్లేపల్లి మహేందర్, మారుపాక వెంకటేష్, దాసరి లక్ష్మయ్య, గుర్రం రాజమణి, చిలువేరు అంజయ్య కలకొండ సంజీవ, జెల్ది రాములు, సామల శోభన్ బాబు, గనబోయిన వెంకటేష్, చింటూ పాల్గొన్నారు.