MANA TOLIVELUGU
Newspaper Banner
Date of Publish : 01 June 2026, 5:25 pm Posted by : MANA TOLIVELUGU

ప్రజావాణిలో గోషామహల్ సమస్యలపై వినతి పత్రం 

ఆక్రమణల తొలగింపు, నాలాల శుద్ధీకరణకు డిమాండ్

మన తొలివెలుగు, తెలంగాణ బ్యూరో రిపోర్టర్ కనుగుల సాయికిషోర

గోషామహల్ నియోజకవర్గ పరిధిలో నెలకొన్న పలు ప్రజా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరుతూ సోమవారం ప్రజావాణి సందర్భంగా జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు వినతిపత్రం సమర్పించారు. గోషామహల్ నియోజకవర్గంలోని ఏడు డివిజన్ లలో కచ్చా మొరీల పూడికతీత పనులు చేపట్టాలని, నాలాల డీ-సిల్టింగ్ పనులను వేగవంతం చేయాలని కోరారు. అలాగే జీహెచ్‌ఎంసీ సర్కిల్-30, 35 పరిధిలోని ఫుట్‌పాత్‌లపై ఉన్న అక్రమ నిర్మాణాలను తొలగించి పాదచారులు సురక్షితంగా, సౌకర్యవంతంగా ప్రయాణించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఎండోమెంట్స్, జీ.వి.ఎం. మరియు ప్రభుత్వ స్థలాల్లో జరుగుతున్న అక్రమ నిర్మాణాలపై కఠిన చర్యలు తీసుకోవాలని వినతిపత్రంలో పేర్కొన్నారు. జీహెచ్‌ఎంసీ సర్కిల్-35 డీఎంసీ ప్రజా సమస్యలపై మరింత బాధ్యతాయుతంగా స్పందించేలా చర్యలు తీసుకోవాలని, ముఖ్యంగా ఫుట్‌పాత్‌ల ఆక్రమణలపై ఇప్పటివరకు సరైన చర్యలు చేపట్టలేదని ఆందోళన వ్యక్తం చేశారు.

అగాపుర జీహెచ్‌ఎంసీ గ్రౌండ్‌లో జరుగుతున్న అక్రమ నిర్మాణాలను తొలగించి క్రీడాకారులకు తాగునీరు సహా మౌలిక సదుపాయాలు కల్పించి క్రీడలను ప్రోత్సహించాలని కోరారు.

ఈ అంశాలపై జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంతో పాటు జీహెచ్‌ఎంసీ సర్కిల్-30 డిప్యూటీ కమిషనర్ శ్రీమతి ఉమా ప్రకాష్‌ను కూడా కలిసి సమస్యలను వివరించారు. వినతిపత్రం అందుకున్న వెంటనే అధికారులు సంబంధిత విభాగాలతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి చర్యలు ప్రారంభించడం పట్ల కాంగ్రెస్ నాయకులు సంతృప్తి వ్యక్తం చేస్తూ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఖైరతాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ బద్దం సతీష్ గౌడ్, జిల్లా సేవాదళ్ అధ్యక్షుడు ఇఫ్తేఖర్, ఖైరతాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి ధనరాజ్, యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ చేతనే కుమార్, గోషామహల్ నియోజకవర్గ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఫారజానా, జై శంకర్ ఆనంద్, మసూద్ అహ్మద్, శ్రీనివాస్ తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.