MANA TOLIVELUGU
Newspaper Banner
Date of Publish : 02 May 2026, 11:18 pm Posted by : MANA TOLIVELUGU

ప్రజా పాలన – 99 రోజుల ప్రగతి ప్రణాళిక కార్యక్రమాలపై విస్తృతంగా ప్రచారం చేయాలి – ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి

మన తొలివెలుగు, యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో ప్రతినిధి జంగిటి రవీందర్ 

ప్రజా పాలన – 99 రోజుల ప్రగతి ప్రణాళిక కార్యక్రమాలపై విస్తృతంగా ప్రచారం చేయాలని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా శనివారం భువనగిరి పట్టణం రాయగిరిలోని సోమా రాధాకృష్ణ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి సమీక్షా సమావేశానికి ముఖ్య అతిధిగా ఆయన హాజరై మాట్లాడుతూ.. ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రగతి కార్యక్రమాలపై విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. ప్రతి శాఖలో జరుగుతున్న పనుల పురోగతిని అధికారులు సమగ్రంగా వివరించగా, క్షేత్ర స్థాయిలో అమలు అవుతున్న పథకాలపై ఎక్కడైనా లోపాలు ఉన్నా వాటిని వెంటనే గుర్తించి, ప్రజలకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వం ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి రెండింటినీ సమతుల్యంగా ముందుకు తీసుకెళ్తోందని స్పష్టం చేశారు. ప్రజల అవసరాలే ప్రభుత్వానికి ప్రాధాన్యతగా తీసుకుని, ప్రతి కుటుంబానికి నేరుగా ప్రయోజనం చేకూరే విధంగా పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు. మహిళల సాధికారత కోసం ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం అమలు చేస్తూ, మహాలక్ష్మి పథకం ద్వారా ఉచితంగా మహిళలకు బస్ లో ప్రయాణం చేస్తున్నారని, గృహజ్యోతి పథకం ద్వారా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తూ కుటుంబాలపై ఆర్థిక భారం తగ్గిస్తున్నామని తెలిపారు. పేద ప్రజల ఆహార భద్రతను దృష్టిలో ఉంచుకుని సన్నబియ్యం పంపిణీ,
అర్హులైన వారికి కొత్త రేషన్ కార్డులు, రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొంటూ, సన్న వడ్లకు క్వింటాల్‌కు రూ.500 బోనస్ అందించడం ద్వారా రైతులకు ప్రోత్సాహం అందిస్తున్నామని తెలిపారు. ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి పెడుతూ ఆయిల్ ఫామ్ సాగుకు ప్రత్యేక రాయితీలు అందిస్తూ రైతుల ఆదాయం పెంచే దిశగా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇళ్లలో నియోజకవర్గంలో ఇప్పటికే 3,500 ఇళ్లు మంజూరు కాగా, రెండో విడతలో మరిన్ని ఇళ్ల మంజూరుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. విద్యార్థుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని జూన్ 2వ తేదీ నుండి రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో అల్పాహార పథకాన్ని ప్రారంభించనున్నట్లు, అలాగే ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించే కార్యక్రమాన్ని అమలు చేయనున్నట్లు వెల్లడించారు. ప్రజల సమస్యలను వేగంగా పరిష్కరించడం ద్వారా ప్రభుత్వంపై నమ్మకం పెంపొందించాల్సిన అవసరం ఉందని, ప్రతి అధికారి బాధ్యతాయుతంగా పనిచేసి ప్రజలకు పారదర్శకంగా సేవలు అందించాలని సూచించారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు మాట్లాడుతూ సంక్షేమ,అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రజల భాగస్వామ్యం ఎంతో కీలకమని అన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన వారికి అందించడం జరుగుతుంది అన్నారు. అభివృద్ధి,సంక్షేమ పథకాలను, అమలు కార్యక్రమాలను ప్రజలకు వివరించడంతో పాటుగా ప్రజల అవసరాలను స్థానికంగా తెలుసుకుని త్వరితంగా పరిష్కరించడం ఈ ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశమన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ లక్ష్మీనారాయణ, భువనగిరి మున్సిపల్ చైర్మన్ శ్రీవాణి, వైస్ చైర్మన్ మంజుల, భువనగిరి మార్కెట్ కమిటీ చైర్మన్ రేఖా, మండల, గ్రామాల ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.