తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలి
మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య ముదిరాజ్ :
ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా తల్లిదండ్రులు తమ చిన్నారులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని లేమూర్ గ్రామ సర్పంచ్ ఎలుక మేఘనాథ్ రెడ్డి, ప్రధానోపాధ్యాయురాలు ఎ. తిరుమల దేవి కోరారు. మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల శామగడ్డ కాలనీలో బడిబాట కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ బడులలో చదువు.. మీ పిల్లల జీవితానికి వెలుగు.. అనే నినాదంతో గ్రామంలో అవగాహన ర్యాలీ నిర్వహించి తల్లిదండ్రులను చైతన్యపరిచారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా లేమూర్ గ్రామ సర్పంచ్ ఎలుక మేఘనాథ్ రెడ్డి పాల్గొని ప్రభుత్వ పాఠశాలల్లో అందుతున్న నాణ్యమైన విద్య, ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు, మధ్యాహ్న భోజనం వంటి సౌకర్యాలను వివరించారు. ప్రతి తల్లిదండ్రి తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు పూజ శివప్రసాద్, గుల్వి కృష్ణ, ప్రమీల సుకుమార్, తల్లిదండ్రులు, గ్రామ పెద్దలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. గ్రామ వీధుల్లో ర్యాలీ నిర్వహించి పాఠశాలలో అడ్మిషన్లు పెంచేందుకు కృషి చేశారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయురాలు ఎ. తిరుమల దేవి మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందిస్తున్న విద్యా ప్రమాణాలు, సౌకర్యాలు ప్రత్యేక కార్యక్రమాల గురించి వివరించారు. తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని కోరారు. విద్యార్థులు తరగతి గదిలోకి కొత్త ఉత్సాహంతో అడుగు పెట్టేందుకు ఏర్పాట్లు చేసినట్లు ప్రధానోపాధ్యాయురాలు తెలిపారు. క్రమ శిక్షణతో చదువుకొని ఉజ్వల భవిష్యత్ సొంతం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన సర్పంచ్ ఎలుక మేఘనాథ్ రెడ్డి కి, వార్డు సభ్యులు పూజ శివప్రసాద్, గుల్వి కృష్ణ , ప్రమీల సుకుమార్ కి, తల్లిదండ్రులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి అందరూ సహకరించాలని కోరారు.