లుక్స్ గ్లోబల్ ఫౌండేషన్ వ్యవస్థాపక ఛైర్మన్ బిక్షపతి యాదవ్
మన తొలివెలుగు, కుత్బుల్లాపూర్ ప్రతినిధి టీ. రమేష్ :
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రజలు ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి పర్యావరణ పరిరక్షణకు కట్టుబడి పనిచేయాలని లుక్స్ గ్లోబల్ ఫౌండేషన్ వ్యవస్థాపక ఛైర్మన్ బిక్షపతి యాదవ్ పిలుపునిచ్చారు. ప్రతి సంవత్సరం జూన్ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని నిర్వహించడం ద్వారా పర్యావరణ పరిరక్షణపై ప్రపంచవ్యాప్తంగా అవగాహన కల్పిస్తున్నారని ఆయన తెలిపారు. ఐక్య రాజ్య సమితి 1974లో ఈ దినోత్సవాన్ని ప్రకటించినప్పటి నుంచి పర్యావరణ సంరక్షణకు ప్రత్యేక ప్రాధాన్యత లభించిందన్నారు. ప్రకృతి మానవాళి మనుగడకు మూలాధారమని, గాలి, నీరు, నేల వంటి సహజ వనరులను పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. పెరుగుతున్న కాలుష్యం, ప్లాస్టిక్ వ్యర్థాలు, అటవీ నిర్మూలన, గ్లోబల్ వార్మింగ్ కారణంగా పర్యావరణ సమతుల్యత దెబ్బతింటోందని ఆందోళన వ్యక్తం చేశారు. అటవీ సంరక్షణ చట్టం–1980, పర్యావరణ పరిరక్షణ చట్టం–1986, ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ సవరణ నియమాలు–2021 వంటి చట్టాలు అమల్లో ఉన్నప్పటికీ, వాటి విజయవంతమైన అమలుకు ప్రజల భాగస్వామ్యం అత్యంత అవసరమని అన్నారు. భవిష్యత్ తరాలకు సురక్షితమైన పర్యావరణాన్ని అందించాలంటే నీరు, పెట్రోల్, డీజిల్, గ్యాస్ వంటి సహజ వనరులను పొదుపుగా వినియోగించాలని సూచించారు. ఒకసారి ఉపయోగించే ప్లాస్టిక్ వస్తువులను పూర్తిగా నిరోధించడం, మొక్కలు నాటడం, వర్షపు నీటి సంరక్షణ, నీటి పొదుపు, వన్యప్రాణుల రక్షణ మరియు పరిసరాల పరిశుభ్రతకు ప్రతి పౌరుడు కృషి చేయాలని కోరారు.పర్యావరణ పరిరక్షణలో ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు మరియు ప్రజలు సమిష్టిగా పనిచేసినప్పుడే సుస్థిర అభివృద్ధి సాధ్యమవుతుందని బిక్షపతి యాదవ్ అన్నారు. ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించి “ప్లాస్టిక్ రహిత – పచ్చదన భారతం” నిర్మాణానికి సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు.