MANA TOLIVELUGU
Newspaper Banner
Date of Publish : 04 June 2026, 7:03 pm Posted by : MANA TOLIVELUGU

ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు రాజకీయ మనుగడ కోసమే

మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య 

బడంగ్‌పేట్ మున్సిపల్ కార్పొరేషన్‌లో అవినీతి జరిగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న రూ.150 కోట్ల అవినీతి వ్యవహారం నుండి ప్రజల దృష్టిని మళ్లించేందుకే మాజీ మేయర్ చిగురింత పారిజాత నర్సింహారెడ్డి ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారని ప్రజలు భావిస్తున్నారని మహేశ్వరం నియోజకవర్గం బీఆర్ఎస్ నాయకుడు సామ మహేందర్ రెడ్డి ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో మాజీ మేయర్ దంపతులు సబితా ఇంద్రారెడ్డి ప్రమేయం ఉందని చేసిన వ్యాఖ్యలు సత్యదూరమైనవి, హాస్యాస్పదమైనవన్నారు. ఈ ఆరోపణలను బీఆర్ఎస్ పార్టీ తరపున తీవ్రంగా ఖండిస్తున్నామని ఆయన తెలిపారు. నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే ముందుగా రూ.150 కోట్ల అవినీతి ఆరోపణలపై సిట్ విచారణకు ఆదేశించాలన్నారు. సాధారణంగా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని భావించిన వ్యక్తులే ఫిర్యాదు చేస్తారు. కానీ అధికారులే పిలిచి మీ ఫోన్ ట్యాపింగ్ అయిందని విచారణకు రమ్మనడం, వారు వెళ్లడం అనుమానాలకు తావిస్తోందన్నారు. ఫోన్ ట్యాపింగ్ అంశంపై ప్రభుత్వం మూడు సంవత్సరాలుగా విచారణ చేస్తున్నప్పటికీ ఇప్పటివరకు ఎటువంటి స్పష్టమైన ఆధారాలు గానీ, పురోగతి గానీ చూపలేకపోయిందన్నారు. దీంతో ఈ వ్యవహారం రాజకీయ ప్రేరేపితమనే అనుమానాలు మరింత బలపడుతున్నాయన్నారు. మాజీ మేయర్ దంపతులు ఒక విషయం గుర్తుంచుకోవాలని, వారికి మేయర్ పదవి దక్కేందుకు సబితా ఇంద్రారెడ్డి సహకారం, ప్రోత్సాహం కీలక పాత్ర పోషించిందన్నారు. అలాగే బడంగ్‌పేట్ మున్సిపల్ కార్పొరేషన్‌లో జరిగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న రూ.150 కోట్ల అవినీతి వ్యవహారంపై సిట్ విచారణ ఎందుకు జరపడం లేదో ప్రభుత్వం స్పష్టం చేయాలన్నారు. ధైర్యం, నిజాయితీ ఉంటే వెంటనే విచారణకు ఆదేశించాలని ఆయన డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే కు ఎవరి ఫోన్ ట్యాపింగ్ చేయించాల్సిన అవసరం లేదన్నారు. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పై చేస్తున్న నిరాధార ఆరోపణలకు కాలమే సమాధానం చెబుతుందన్నారు. మాజీ మేయర్ దంపతులు ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పై చేసిన అసత్య ఆరోపణలు, సత్యదూరపు వ్యాఖ్యలు మానుకొని వెంటనే తమ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని,బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.