బీజేపీ పార్టీ రేపులను ఎంకరేజ్ చేస్తే… బీఆర్ఎస్ పార్టీ డ్రగ్స్ ఎంకరేజ్ చేస్తుంది
మంత్రిగా పనిచేసిన వ్యక్తికి ఎలా మాట్లాడాలో తెలియదా
బూత్ ఏజెంట్ల శిక్షణ శిబిరంలో అసత్య పాఠాలు
‘బండి’ కుమారుడి కేసులో చట్టం తన పని తాను చేస్తుంది
టీపీసీసీ అధికార ప్రతినిధి ధర్పల్లి రాజశేఖర్ రెడ్డి
మన తొలివెలుగు, తెలంగాణ బ్యూరో ప్రతినిధి
కేంద్ర ప్రభుత్వం బండి సంజయ్ ను కేంద్రమంత్రి పదవి నుంచి వెంటనే బర్తరఫ్ చేయాలని టీపీసీసీ అధికార ప్రతినిధి ధర్పల్లి రాజశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు. మంత్రి పదవిలో కొనసాగితే కేసు విచారణ పై ప్రభావం పడే అవకాశం ఉందని, పోలీసులు స్వేచ్ఛగా దర్యాప్తు చేయలేరని, పై స్థాయి నుంచి ఒత్తిళ్ల వల్ల విచారణ సక్రమంగా జరగదని ఆరోపించారు. బండి సంజయ్ కుమారుడి కేసులో కాంగ్రెస్ ప్రభుత్వం చట్టపరంగా చర్యలు తీసుకుంటుందని, సీఎం రేవంత్ రెడ్డిని విమర్శించే అర్హత కేటీఆర్ కు లేదని టీపీసీసీ అధికార ప్రతినిధి, మాజీ కార్పొరేటర్ ధర్పల్లి రాజశేఖర్ రెడ్డి విమర్శించారు. లుక్ అవుట్ నోటీసులు అందుకున్న నిందితుడు భగీరథ్ ను కాపాడేందుకు తండ్రి బండి సంజయ్ ప్రయత్నాలు ప్రారంభించాడని, సీఎం రేవంత్ రెడ్డి సహకరిస్తున్నారని ఆదివారం జరిగిన హస్తినాపురం బీఆర్ఎస్ బూత్ కమిటీ సమావేశంలో కేటీఆర్ మాట్లాడడం పై ఆయన మండిపడుతూ సోమవారం ఎల్బీనగర్ లో ప్రత్యేక మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ధర్పల్లి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ… బండి సంజయ్ కుమారుడి అరెస్ట్ విషయంలో చట్టం తన పని తాను చేస్తుందని, ప్రభుత్వం అన్ని విషయాలను పరిగణనలోకి తీసుకుని ముందుకు వెళ్తుందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కేటీఆర్ చేసిన ఆరోపణలను ఆయన ఖండించారు. బండి భగీరథ్ కేసులో ముఖ్యమంత్రి ఎందుకు వెంటనే యాక్షన్ తీసుకోలేదు అంటున్నావు?, ఈ కేసులో మైనర్ బాలిక ఉన్నది కాబట్టి కొన్ని లీగల్ గా చేయాల్సి ఉంటుందని, ఈ విషయాలు మంత్రిగా పని చేసిన మీకు తెలియకపోతే ఎట్లా? అని ప్రశ్నించారు.
బీజేపీ రేపులను ఎంటర్ టైన్ చేస్తే… బీఆర్ఎస్ డ్రగ్స్ ఎంకరేజ్ చేస్తుందన్నారు. కేటీఆర్ ముందుగా డ్రగ్స్ కేసులో పట్టుబడిన పైలట్ రోహిత్ రెడ్డిని ఎందుకు సస్పెండ్ చేయలేదని ప్రశ్నించారు. సిగ్గు శరం లేకుండా బండి సంజయ్ కుమారుడిని రేవంత్ రెడ్డి కాపాడుతున్నారని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. కాల్పులు జరిపిన రోహిత్ రెడ్డిని ఎందుకు కాపాడుతున్నావని, మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డిపై ఇప్పటి వరకు కేవలం నోటీసులతోనే సరిపెట్టారని విమర్శించారు. అలాంటి పరిస్థితుల్లో ఎల్బీనగర్‌కు వచ్చి ఇతరులకు నీతులు చెప్పడం సరికాదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి మూటలు మొస్తుండని ఆరోపణలు చేస్తున్నప్పుడు.. మేము కూడా ఆరోపణలు చేస్తున్నాము.. మీరు ఎల్బీనగర్ లో వచ్చింది… డ్రగ్స్ పెడ్లర్స్ దగ్గర మామూళ్లు తీసుకెళ్లడానికి వస్తున్నారని అంటున్నాం.. మీరు యాక్సెప్ట్ చేస్తారా.? అని ప్రశ్నించారు. మీ పార్టీ బీఆర్ఎస్ కాదు.. డీఆర్ఎస్ పార్టీ అని ఆరోపించారు. మీరు అడ్డగోలుగా మాట్లాడితే మేము అడ్డగోలుగా మాట్లాడాల్సి వస్తుందని హెచ్చరించారు.
పేపర్ లీకేజ్ కేసుల్లో హస్తం ఉన్న.. బీఆర్ఎస్, బీజేపీ నేతలను ఆ పార్టీలు ఎందుకు సస్పెండ్ చేయడం లేదన్నారు. నీట్ పరీక్ష రద్దుతో రాష్ట్రంలో 25 లక్షల మంది విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నీట్ పరీక్ష లీకేజీ విషయంలో పార్జీలకు అతీతంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఇలాంటి విషయాలపై మౌనం వహిస్తున్న కేటీఆర్… సీఎం రేవంత్ రెడ్డిపై అనవసర ఆరోపణలు మానుకోవాలని హితవు పలికారు.
సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు చేస్తే వదిలి పెట్టం
సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెట్టేముందు మీ కుటుంబ సభ్యుల్లోని తల్లి, చెల్లి, అక్కని గుర్తు చేసుకోండని, సోషల్ మీడియాలో ఎవరైనా సరే అడ్డగోలు పోస్టులు, కామెంట్స్ పెడితే ఎవరిని వదిలిపెట్టలేదని ధర్పల్లి రాజశేఖర్ రెడ్డి హెచ్చరించారు. దిశా కేసుకు సంబంధించి సోషల్ మీడియాలో అసభ్యకరంగా, అనుచితంగా పోస్టులు పెట్టిన వారికి తప్పకుండా శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. 2019లో దిశా ఘటన జరిగిన అనంతరం కొంతమంది యువకులు సోషల్ మీడియాలో బాధిత మహిళపై సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెట్టారని, దీనిపై తాను 2019 నవంబర్ 30న ఎల్బీనగర్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశానని ఆయన గుర్తు చేశారు. ఆ కేసుకు సంబంధించిన ఎవిడెన్స్ సోమవారం రంగా రెడ్డి జిల్లా కోర్టులో విచారణకు వచ్చిందని, నిందితులకు త్వరలోనే శిక్ష పడే విధంగా కృషి చేస్తానని పేర్కొన్నారు. సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లు అసభ్యకరమైన కామెంట్లు, పోస్టులు పెట్టే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. యువత సోషల్ మీడియాను బాధ్యతాయుతంగా ఉపయోగించాలని, తల్లిదండ్రులు కూడా పిల్లలకు సరైన అవగాహన కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు ప్రవీణ్ రెడ్డి, ఉమేష్ సింగ్, విష్ణు, రోహిత్, నరేందర్ తదితరులు పాల్గొన్నారు.