MANA TOLIVELUGU
Newspaper Banner
Date of Publish : 05 June 2026, 7:17 pm Posted by : MANA TOLIVELUGU

బస్ షెల్టర్ లేక ప్రయాణికుల తీవ్ర ఇబ్బందులు

పట్టించుకోని అధికారులు

ఇంజన్ బౌలి బస్టాప్‌లో షెడ్ తొలగించి చాల కాలమైన తిరిగి ఏర్పాటు చేయకపోవడంపై ప్రజల ఆగ్రహం

మన తొలివెలుగు, చాంద్రాయణగుట్ట, ప్రతినిధి శైలేష్ కుమార్ 

ఫలక్‌నుమా ఇంజన్ బౌలి ప్రోగ్రెస్ స్కూల్ సమీపంలో ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ ముందు ఉన్న బస్టాప్ షెల్టర్ ను జీహెచ్ఎంసీ అధికారులు తొలగించి చాలా నెలలు గడిచినా, ఇప్పటి వరకు కొత్త షెడ్డు ఏర్పాటు చేయకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎండకు నీడ లేక, వర్షం పడితే ప్రయాణికులు తడిసి బస్సుల కోసం గంటల తరబడి నిలబడాల్సి వస్తోంది. వృద్ధులు, మహిళలు, వికలాంగులు, చిన్న పిల్లలతో వచ్చే తల్లులు కూర్చునేందుకు కనీస సౌకర్యం లేక ఇబ్బంది పడుతున్నారు.

రాత్రి సమయాల్లో లైటింగ్ కూడా లేకపోవడంతో భద్రతా సమస్యలు కూడా తలెత్తే ప్రమాదం ఉందని ప్రయాణికులు వాపోతున్నారు. ఉచిత మహిళా బస్సు పథకం వల్ల ఈ బస్టాప్‌లో రద్దీ పెరిగింది. కాబట్టి వెంటనే కొత్త షెడ్డును, కూర్చునేందుకు బెంచీలు, లైటింగ్ ఏర్పాటు చేయాలని ప్రయాణికులు అధికారులను కోరుతున్నారు. నెలల తరబడి విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదని, ఇప్పటికైనా అధికారులు స్పందించి శాశ్వత షెడ్డు నిర్మాణం చేయాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు.