MANA TOLIVELUGU
Newspaper Banner
Date of Publish : 17 July 2026, 3:36 pm Posted by : MANA TOLIVELUGU

బీసీ మహిళను అవమానిస్తే ఊరుకోం

యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడిపై చర్యలు తీసుకోవాలి

బహిరంగ క్షమాపణకు గుదే మధుసూదన్ యాదవ్ డిమాండ్

మన తొలివెలుగు, మోత్కూర్ ప్రతినిధి పబ్బు ప్రవీణ్ :

బీసీ సామాజిక వర్గానికి చెందిన సీనియర్ మహిళా నాయకురాలు ఈశ్వరమ్మ యాదవ్ పట్ల యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను శ్రీకృష్ణ యాదవ సేవా సమితి తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు సమితి సభ్యుడు గుదే మధుసూదన్ యాదవ్ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. బీసీ మహిళను అవమానించడం అంటే యావత్ బీసీ సమాజాన్ని కించపరచడమేనని ఆయన తెలిపారు. రాజకీయాల్లో విభేదాలు సహజమని, కానీ మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా మాట్లాడటం ప్రజాస్వామ్యంలో ఆమోదయోగ్యం కాదన్నారు. మహిళల గౌరవం గురించి మాట్లాడే కాంగ్రెస్ నాయకులు.. సొంత పార్టీ నేత వ్యాఖ్యలపై ఎందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశ్నించారు. శివచరణ్ రెడ్డి వెంటనే ఈశ్వరమ్మ యాదవ్‌కు బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలని, కాంగ్రెస్ అధిష్ఠానం ఆయనను తక్షణమే యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్ష పదవి నుండి తప్పించాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తమ వైఖరిని స్పష్టం చేయాలన్నారు. బీసీలను కేవలం ఓట్ల కోసం వాడుకుని, గౌరవించే విషయంలో వివక్ష చూపిస్తే చూస్తూ ఊరుకోబోమని, బీసీల ఆత్మగౌరవం కోసం చట్టబద్ధంగా పోరాడుతామని హెచ్చరించారు.