మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా రెడ్డి డిమాండ్
రైతులు భూములు కోల్పోతే కేవలం పరిహారం ఇవ్వడం సరిపోదు. వారి కుటుంబాల భవిష్యత్తుకు భరోసా కల్పించాలి
రైతుల భవిష్యత్తుకు భరోసా కావాలి.. ఎకరాకు కోటి రూపాయల నష్టపరిహారంకై డిమాండ్
మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య
రైతుల హక్కుల పరిరక్షణ కోసం, వారికి సరైన న్యాయం జరిగేంత వరకు చివరి వరకు పోరాడుతామని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు . మహేశ్వరం నియోజకవర్గంలోని కందుకూరు మండలంలో ఎండోమెంట్ భూములు కోల్పోతున్న రైతులకు ప్రభుత్వం ప్రకటించిన రూ.30 లక్షల నష్టపరిహారం ఏమాత్రం సరిపోదని, రైతులకు నిజమైన న్యాయం చేయాలంటే ఎకరాకు కనీసం రూ.1 కోటి చొప్పున నష్టపరిహారం అందించాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి డిమాండ్ చేశారు.

రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సీ. నారాయణరెడ్డిని కలిసి రైతుల తరపున వినతి పత్రాన్ని సమర్పించిన అనంతరం ఆమె మాట్లాడుతూ.. ప్రస్తుతం ఆ ప్రాంతంలో భూముల మార్కెట్ విలువను పరిగణనలోకి తీసుకుంటే ప్రభుత్వం ప్రకటించిన పరిహారం రైతుల భవిష్యత్తుకు ఏమాత్రం భరోసా కల్పించదన్నారు. తరతరాలుగా సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న రైతులు భూములు కోల్పోతున్న నేపథ్యంలో వారికి గౌరవప్రదమైన నష్టపరిహారం అందించడం ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు. అదే విధంగా రావిర్యాల వక్ఫ్ బోర్డు భూముల విషయంలో కూడా ఆందోళన వ్యక్తం చేసిన సబితా ఇంద్రారెడ్డి, ఎన్నో సంవత్సరాలుగా పొజిషన్‌లో ఉండి సాగు చేస్తున్న రైతులను పక్కనబెట్టి, కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కోర్టు ఉత్తర్వుల పేరుతో భూములపై హక్కులు సాధించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. రైతులను బెదిరించి భూములను స్వాధీనం చేసుకునే ప్రయత్నాలపై సమగ్ర విచారణ జరిపి, నిజమైన రైతుల హక్కులను కాపాడాలని జిల్లా కలెక్టర్‌ను కోరినట్లు తెలిపారు. గతంలో ఫార్మాసిటీ కోసం సేకరించిన 14 వేల ఎకరాల భూములకు బదులుగా రైతులకు ఎకరానికి ఒక గుంట చొప్పున ఇళ్ల స్థలాలు కేటాయించాలని నిర్ణయం తీసుకున్నప్పటికీ, ఇప్పటికీ అనేక మంది రైతులకు పూర్తి స్థాయిలో పొజిషన్ ఇవ్వలేదని ఆమె పేర్కొన్నారు. కొంతమందికి మాత్రమే పొజిషన్ ఇచ్చి, మిగిలిన రైతులను నిరీక్షింపజేయడం సరికాదని, అర్హులైన ప్రతి రైతుకు వెంటనే ఇళ్ల స్థలాల పొజిషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. బేగర్‌కంచ తదితర గ్రామాల రైతులకు కూడా ఎకరానికి ఒక గుంట చొప్పున ఇళ్ల స్థలాలు కేటాయించాలని కోరిన ఆమె, భూసేకరణ జరుగుతున్న ప్రాంతాల్లో గ్రామాల భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని శ్మశానవాటికలు, కమ్యూనిటీ హాళ్లు, క్రీడా మైదానాలు వంటి ప్రజా అవసరాల కోసం కనీసం 10 నుంచి 20 ఎకరాల భూమిని గ్రామాలకు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. అభివృద్ధి పేరుతో భూములు సేకరిస్తే రైతులకు తగిన నష్టపరిహారం, ఇళ్ల స్థలాల హక్కులు కల్పించడంతో పాటు గ్రామాల భవిష్యత్ అవసరాలను కూడా ప్రభుత్వం దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోవాలని ఆమె సూచించారు.
రైతుల భూములు కోల్పోతే కేవలం పరిహారం ఇవ్వడం సరిపోదు. వారి కుటుంబాల భవిష్యత్తుకు భరోసా కల్పించే విధంగా న్యాయం జరగాలి. రైతుల హక్కుల పరిరక్షణ కోసం చివరి వరకు పోరాడుతామని సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు మన్నే జయేందర్ ముదిరాజ్, రంగాపురం లక్ష్మీనరసింహారెడ్డి, వెంకట్ రాజిరెడ్డి, జిల్లెల లక్ష్మయ్య, ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.