MANA TOLIVELUGU
Newspaper Banner
Date of Publish : 11 June 2026, 2:17 pm Posted by : MANA TOLIVELUGU

మంచినీటి సమస్యను వెంటనే పరిష్కరించండి 

జలమండలి అధికారులకు చింతల రవి కుమార్ గుప్త వినతి

మన తొలివెలుగు, ఎల్బీనగర్ ప్రతినిధి 

వనస్థలిపురం డివిజన్ పరిధిలో నెలకొన్న తీవ్రమైన మంచినీటి సమస్యను తక్షణమే పరిష్కరించాలని బీఆర్ఎస్ పార్టీ వనస్థలిపురం డివిజన్ అధ్యక్షులు చింతల రవి కుమార్ డిమాండ్ చేశారు. ఈ మేరకు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జలమండలి డిప్యూటీ జనరల్ మేనేజర్ (డీజీఎం) నాగరాజు కి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా చింతల రవి కుమార్ మాట్లాడుతూ.. వనస్థలిపురం డివిజన్ పరిధిలోని పలు కాలనీలలో తాగునీటి సరఫరా సక్రమంగా జరగకపోవడం, తక్కువ ప్రెషర్ తో నీరు రావడం, సరఫరా సమయాలు పాటించకపోవడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు, చిన్నారులు నిత్యావసరమైన తాగునీటి కోసం గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొన్నదని ఆవేదన వ్యక్తం చేశారు. అదే విధంగా ప్రజల అవసరాల కోసం సరఫరా చేయాల్సిన నీటి ట్యాంకర్లను కొందరు వ్యక్తులు అక్రమంగా విక్రయిస్తున్నారనే ఫిర్యాదులు ప్రజల నుండి వస్తున్నాయని, ప్రజల దాహాన్ని ఆసరాగా చేసుకుని నీటిని వ్యాపారంగా మార్చడం అత్యంత దురదృష్టకరమైన, ఖండనీయమైన విషయమని పేర్కొన్నారు. కావున వనస్థలిపురం డివిజన్ పరిధిలోని అన్ని కాలనీలలో తక్షణమే పరిస్థితిని సమీక్షించి, అవసరమైన ప్రాంతాలకు అదనపు నీటి ట్యాంకర్లను ఏర్పాటు చేయడంతో పాటు తగిన ఒత్తిడితో నిరంతరాయంగా మంచినీటి సరఫరా జరిగేలా చర్యలు తీసుకోవాలని జలమండలి అధికారులను కోరారు. అలాగే ట్యాంకర్ల ద్వారా నీటిని అక్రమంగా విక్రయిస్తున్న వారిపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కొలిశెట్టి సంజయ్ కుమార్, వర్కింగ్ అధ్యక్షులు గోని శ్రీధర్ గౌడ్, ప్రశాంతనగర్ కాలనీ అధ్యక్షులు కరుణాకర్ రెడ్డి, శ్రీనివాస పురం కాలనీ అధ్యక్షులు దూసరి మధు గౌడ్, ఫేస్2హుడాకాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు ఆనంద్ రాజ్, ప్రశాంత్ నగర్ ప్రధాన కార్యదర్శి బాబురావు, గడాల రాజ, పి.వి. నరసింహరావు, మిట్ట రామ్మోహన్, శ్రీనివాసరావు, అశోక్, రవికాంత్, ప్రకాష్, విజయ్ కుమార్ తదితర నాయకులు, పార్టీ కార్యకర్తలు, సంక్షేమ సంఘాల ప్రతినిధులు, కాలనీ ప్రముఖులు పాల్గొన్నారు.