MANA TOLIVELUGU
Newspaper Banner
Date of Publish : 01 June 2026, 1:50 pm Posted by : MANA TOLIVELUGU

యూజీడీ సీసీ రోడ్ల పనులు వెంటనే పూర్తి చేయాలి

భవానీనగర్ కాలనీ వాసుల డిమాండ్

మన తొలివెలుగు, కుత్బుల్లాపూర్ ప్రతినిధి టి.రమేష్ :

భవాని నగర్ కాలనీలో నెలల తరబడి నిలిచిపోయిన యూజీడీ, సీసీ రోడ్ల పనుల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నిధులు మంజూరు చేసినప్పటికీ పనులు మధ్యలో నిలిచిపోవడంతో కాలనీలో మురుగునీరు రోడ్లపైకి వస్తోంది. రోడ్లు దెబ్బతిని ప్రజల రాకపోకలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. వర్షాకాలంలో పరిస్థితి మరింత దారుణంగా మారి, నీటి నిల్వలు, దోమల వ్యాప్తి, దుర్వాసన, ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయన్నారు. కాలనీవాసులు క్రమం తప్పకుండా ఇంటి పన్నులు, ఇతర మున్సిపల్ పన్నులు చెల్లిస్తున్నప్పటికీ, ప్రాథమిక మౌలిక సదుపాయాలు అందకపోవడం విచారకరం. వృద్ధులు, మహిళలు, విద్యార్థులు, ఉద్యోగులు ప్రతిరోజూ అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యపై పలుమార్లు సంబంధిత అధికారులకు వినతిపత్రాలు సమర్పించినప్పటికీ ఇప్పటి వరకు స్పష్టమైన చర్యలు కనిపించడం లేదు. పనులు ఎందుకు నిలిచిపోయాయో ప్రజలకు వివరించాలి. ఇప్పటికే మంజూరైన అభివృద్ధి పనులను ఎటువంటి రాజకీయ లేదా పరిపాలనా కారణాలతో ఆలస్యం చేయకుండా వెంటనే పునఃప్రారంభించి పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ప్రజల సంక్షేమం కంటే రాజకీయాలు ముఖ్యమనే పరిస్థితి ఉండకూడదని ప్రజలు చెల్లించే పన్నులతోనే ప్రభుత్వ వ్యవస్థ నడుస్తుంది. అందువల్ల ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలను అందించడం ప్రభుత్వ మరియు సంబంధిత అధికారుల బాధ్యత అని అన్నారు. అధికారులు తక్షణమే స్పందించి నిలిచిపోయిన యూజీడీ పనులను వెంటనే ప్రారంభించాలని వారు డిమాండ్ చేశారు. సీసీ రోడ్ల నిర్మాణాన్ని అత్యవసరంగా పూర్తి చేయాలి. పనుల ఆలస్యానికి గల కారణాలను ప్రజలకు వెల్లడించాలని పూర్తి చేసే గడువును అధికారికంగా ప్రకటించాలని లేనిపక్షంలో భవాని నగర్ కాలనీ ప్రజలు ప్రజాస్వామ్య పద్ధతుల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాల్సి వస్తుంది. మేడ్చల్ అర్బన్ జిల్లా బీజేపీ అధికార ప్రతినిధి నల్ల జై శంకర్ గౌడ్, జిల్లా కౌన్సిల్ సభ్యుడు పులి బలరాం, రవివర్మ తదితరులు డిమాండ్ చేశారు.