MANA TOLIVELUGU
Newspaper Banner
Date of Publish : 28 May 2026, 8:41 pm Posted by : MANA TOLIVELUGU

రహదారులపై మురుగు పరుగో పరుగు

డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తం 

చోద్యం చూస్తున్న జల్ పల్లి సర్కిల్ అధికారులు 

తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న శ్రీరామ కాలనీవాసులు

మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య 

జల్ పల్లి సర్కిల్ పరిధి శ్రీరామ కాలనీ ప్రధాన రహదారి విజయలక్ష్మి గార్డెన్, నారాయణ స్కూల్ రహదారంలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారయింది. దీంతో పాదాచారులు, వాహనదారులు అవస్థలు పడుతున్నారు. ప్రధాన రహదారి, పరిసర ప్రాంతాల్లోని పలు కాలనీలలో మురుగు నీటి వ్యవస్థ అధ్వానంగా మారింది, దీనివల్ల నివాసితులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా, పాత డ్రైనేజీ పైపులైన్లు తరచుగా పగిలిపోవడం, ఇళ్లలోని వ్యర్థాలను వరద నీటి పైపులైన్ల లో వేయడం వల్ల మ్యాన్ హోళ్ళ లో చెత్తాచెదారం నిండి మ్యాన్ హోళ్ళ నుండి మురుగు, చెత్తాచెదారం, రోడ్లపైకి వస్తోంది. రహదారి పొడుగునా మురుగు నీరు పారడంతో తీవ్రమైన ముక్కుపుటలు అదిరిపోయి దుర్గంధం వెదజల్లుతుందని శ్రీరామ కాలనీ వాసులు, ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత రెండు సంవత్సరాల క్రితమే నూతనంగా రూ. 50 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు అభివృద్ధి చేశారు. తరచు ఈ రహదారిలో మురుగు సమస్య ఉత్పన్నమవుతుంది. గత నెల రోజులుగా మురుగు నీరు పారడంతో రహదారి దెబ్బతినే అవకాశం ఉన్నది. జీహెచ్ఎంసీ సర్కిల్ అధికారులు గల్ఫర్ మిషన్ ఏర్పాటు చేసి మ్యాన్ హోల్ క్లీన్ చేయించి రహదారిపై మురుగు నీరు పారకుండా చర్యలు తీసుకోవాలని ప్రజల కోరుతున్నారు.

ప్రజలకు అవగాహన కల్పించాలి

మ్యాన్‌హోల్‌లు కేవలం మురుగునీటి ప్రవాహానికి మాత్రమేనని, చెత్తాచెదారం పడేసే డస్ట్‌ బిన్‌లు కావని ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. ప్రజల్లో కూడా శానిటేషన్ పై అవగాహన కలిగి ఉండాలి. తరచూ అధికారులు అవగాహన కలిగిస్తుండాలి. మ్యాన్‌హోల్‌లు కేవలం మురుగునీటి ప్రవాహానికి మాత్రమేనని, చెత్తాచెదారం పడేసే డస్ట్‌ బిన్‌లు కావని ప్రజలకు అధికారులు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేసేవారు పేర్కొంటున్నారు. మ్యాన్‌హోళ్ళను తెరవడం లేదా వాటిలో ప్లాస్టిక్, ఇండ్లలో, దుకాణాల చెత్త, నిర్మాణ వ్యర్థాలను పడేయడం చట్టరీత్యా నేరమని అధికారులు ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉన్నది.