అమ్మవారికి ఇక్కత్ పట్టుచీర సమర్పించిన ఏ పావని వినయ్ కుమార్ దంపతులు
మన తొలివెలుగు తెలంగాణ బ్యూరో ప్రతినిధి సాయి కిషోర్ కనుగుల (08 ఆగస్ట్ 2026) :
పాతబస్తీలోని ప్రసిద్ధి చెందిన లాల్ దర్వాజా శ్రీ సింహవాహిని మహంకాళీ అమ్మవారికి ఆషాడ బోనాల సందర్భంగా గాంధీనగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ ఏ. పావని వినయ్ కుమార్ బంగారు బోనంతో పాటు ప్రత్యేక చేనేత ఇక్కత్ పట్టుచీరను కుటుంబ సభ్యులతో కలిసి సమర్పించారు. చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏనుగుల అనిల్ కుమార్ కుటుంబ సభ్యుల స్వహస్తాలతో నేసిన ఇక్కత్ పట్టుచీరను అమ్మవారికి అలంకరించారు.
అమ్మవారికి ప్రత్యేక పూజలు, కుంకుమార్చన నిర్వహించి భక్తి శ్రద్ధలతో బంగారు బోనం సమర్పించారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మొక్కులు చెల్లించారు. మేకలబండ నుంచి డప్పు చప్పుళ్లు, పోతరాజుల విన్యాసాలు, వేషధారణలతో భారీ ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు.

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ కుమార్తె, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి బండారు విజయలక్ష్మి , బిగ్ బాస్ ఫేమ్ భాను పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. గౌలిపుర మాజీ కార్పొరేటర్లు ఆలె భాగ్యలక్ష్మి, ఆలె జితేందర్ తదితరులు పాల్గొన్నారు. బోనాల ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతుండగా, భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. లాల్ దర్వాజా బోనాలు తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలుస్తాయని, అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని పావని వినయ్ కుమార్ కోరారు.