అర్హులైన ప్రతి కుటుంబానికి వెంటనే చెక్కులు అందించాలి – ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి
మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య
సంక్షేమ పథకాల అమలులో రాజకీయాలకు తావులేకుండా అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వం అందించే సహాయం పారదర్శకంగా చేరాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మహేశ్వరం లో నిర్వహించిన కళ్యాణ లక్ష్మి – షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ
ప్రత్యేకంగా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ విషయంలో మంత్రి లేదా ఎమ్మెల్యే వచ్చినప్పుడే చెక్కులు ఇవ్వాలనే విధానాన్ని పక్కన పెట్టాలని తెలిపారు. ప్రభుత్వానికి చెందిన ఈ సహాయం ప్రజల హక్కు అని, వచ్చిన చెక్కులను వెంటనే సంబంధిత లబ్ధిదారులకు ఎమ్మార్వో కార్యాలయం ద్వారా అందించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. పేద కుటుంబాలకు ఆడబిడ్డ పెళ్లి సమయంలో ప్రభుత్వం అందించే ఈ ఆర్థిక సహాయం ఎంతో ఊరటనిస్తోందని పేర్కొన్నారు. గతంలో ప్రవేశపెట్టిన కేసీఆర్ కిట్, కళ్యాణ లక్ష్మీ వంటి పథకాలు వేలాది కుటుంబాలకు అండగా నిలిచాయని గుర్తుచేశారు. మహిళల సంక్షేమం, గర్భిణీల ఆరోగ్యం, ఆడబిడ్డల భవిష్యత్తు కోసం తీసుకొచ్చిన సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా కొనసాగించాలని ఆమె అభిప్రాయపడ్డారు.
అదేవిధంగా ప్రభుత్వ పథకాల అమలులో ఆలస్యం, అనవసర రాజకీయ ప్రచారం ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తాయని, అధికారులు ప్రజల పట్ల మరింత బాధ్యతతో వ్యవహరించాలని సూచించారు. ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు చేరేలా కృషి చేయాలని ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో అప్పలనాయుడు, సర్పంచ్ మునగపాటి నవీన్, ఉప సర్పంచ్, బీఆర్ఎస్ నాయకులు, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.