త్రిబుల్ ఐటీ సీటు సాధించిన రఘుపతికి ఘన సన్మానం
మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య ముదిరాజ్ :
విద్యార్థులు తమ చదువుపై శ్రద్ధ పెట్టి, బాగా కష్టపడి చదవడం ద్వారా ఉన్నత స్థానాలకు చేరుకుని, సమాజంలో పేరు, కీర్తిని సంపాదించుకోవాలని జెడ్పీహెచ్‌ఎస్ (బి) తుక్కుగూడ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు భాస్కర్ రెడ్డి అన్నారు. తుక్కుగూడ మండల పరిధిలోని జెడ్పీహెచ్‌ఎస్ (బి) తుక్కుగూడ పాఠశాలకు చెందిన విద్యార్థి రఘుపతి ప్రతిష్టాత్మక త్రిబుల్ ఐటీ బాసరలో సీటు సాధించడం పట్ల పాఠశాల ప్రధానోపాధ్యాయుడు భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు కూడా కష్టపడి చదివితే ఉన్నత శిఖరాలను అధిరోహించగలరని రఘుపతి నిరూపించాడని అన్నారు. అతని విజయం పాఠశాలకు గర్వకారణమని, ఇతర విద్యార్థులకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బుగ్గ రాములు, మల్లారెడ్డి ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొని రఘుపతిని అభినందించారు. విద్యార్థి భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి పాఠశాల, గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.