MANA TOLIVELUGU
Newspaper Banner
Date of Publish : 17 October 2026, 7:25 pm Posted by : MANA TOLIVELUGU

హనుమాన్‌వాడలో ఘనంగా దుర్గామాత దసరా ఉత్సవాలు 

మహా అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన కౌన్సిలర్ కుక్కదూవు పద్మా సోమయ్య

అన్నదానానికి ఆర్థిక సహాయం అందించిన దాత పల్లెపాటి నాగరాజు

మన తొలివెలుగు | యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి | జంగిటి రవీందర్ | అక్టోబర్ 17, 2026 :

యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలోని హనుమాన్‌వాడలో దుర్గామాత దేవీ నవరాత్రి, దసరా ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శనివారం భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన మహా అన్నదాన కార్యక్రమాన్ని ఏడో వార్డు కౌన్సిలర్ కుక్కదూవు పద్మా సోమయ్య ప్రారంభించారు.

ఈ అన్నదాన కార్యక్రమానికి ప్రముఖ దాత పల్లెపాటి నాగరాజు ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులు నాగరాజును శాలువాతో సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ కుక్కదూవు పద్మా సోమయ్య మాట్లాడుతూ.. దుర్గామాత ఆశీస్సులతో వార్డు ప్రజలందరూ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం కంటే గొప్ప సేవ మరొకటి లేదని పేర్కొన్నారు. భక్తిశ్రద్ధలతో అమ్మవారి ఉత్సవాలను నిర్వహిస్తూ, అన్నదాన కార్యక్రమానికి ఆర్థిక సహాయం అందించిన పల్లెపాటి నాగరాజు సేవలు అభినందనీయమని కొనియాడారు.

అన్నదాన దాత పల్లెపాటి నాగరాజు మాట్లాడుతూ.. దుర్గామాత ఉత్సవాల్లో భాగంగా భక్తులకు అన్నవితరణ చేయడంలో తన వంతు సహకారం అందించడం ఎంతో తృప్తినిచ్చిందని తెలిపారు. అమ్మవారి కృపతో భవిష్యత్తులోనూ మరిన్ని సామాజిక, ధార్మిక కార్యక్రమాలను నిర్వహించేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. దుర్గామాత ఉత్సవాల్లో భక్తులకు అన్నదానం ఏర్పాటు చేయడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.