ePaper
Friday, October 16, 2026
📄 ePaper
Homeక్రైమ్ న్యూస్మలక్‌పేట్ పోలీస్ స్టేషన్‌లో బాధితులకు న్యాయం జరగదా..?

మలక్‌పేట్ పోలీస్ స్టేషన్‌లో బాధితులకు న్యాయం జరగదా..?

📰 Generate e-Paper Clip

 ఫిర్యాదు చేసినా స్పందన కరువు.. బాధితురాలి ఆవేదన

కేసు నమోదు కోసం పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నానంటున్న బాధితురాలు

ఇంటి తాళాలు పగలగొట్టి విలువైన వస్తువులు తీసుకెళ్లారని ఆరోపణ

మలక్‌పేట్ సీఐ ఏకపక్ష వైఖరిపై ఆరోపణలు

ఉన్నతాధికారుల జోక్యం చేసుకోవాలని బాధితురాలి విజ్ఞప్తి

మన తొలివెలుగు | హైదరాబాద్ :

ప్రజలకు రక్షణ కల్పించి, బాధితులకు అండగా నిలవాల్సిన పోలీసులపై మలక్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ బాధితురాలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. తనకు జరిగిన అన్యాయంపై ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసుల నుంచి ఆశించిన స్పందన లభించలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేసు నమోదు కోసం పలుమార్లు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాల్సి వస్తోందని వాపోతున్నారు.

ఇంటి తాళాలు పగలగొట్టి బంగారం, వస్తువులు తీసుకెళ్లారని ఆరోపణ

బాధితురాలి కథనం ప్రకారం.. తాను అద్దెకు ఉంటున్న ఇంటిని ఖాళీ చేయాలని ఇంటి యజమానురాలు కోరినట్లు తెలిపారు. అయితే కొంత సమయం ఇవ్వాలని తాను కోరినట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో తాను ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లిన సమయంలో తన అనుమతి లేకుండా ఇంటి తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించారని ఆరోపించారు.

ఇంట్లో తన ఇద్దరు కుమార్తెలకు సంబంధించిన బంగారు ఆభరణాలతో పాటు ఇతర విలువైన వస్తువులు ఉన్నాయని, ఇంటి యజమానురాలు తన తల్లి, కుమారుడు, మరికొందరితో కలిసి తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించి వాటిని తీసుకెళ్లారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నట్లు బాధితురాలు చెబుతున్నారు.

సీఐ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ ఆరోపణలు

ఈ ఘటనపై పోలీసులను ఆశ్రయించినప్పటికీ తన ఫిర్యాదుపై తగిన చర్యలు తీసుకోలేదని బాధితురాలు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా మలక్‌పేట్ సీఐ నిందితుల పక్షాన ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు చేశారు. తాను ఇంటిని ఖాళీ చేస్తానని చెప్పినప్పటికీ, తనకు సమాచారం ఇవ్వకుండా ఇంటి తాళాలు పగలగొట్టి వస్తువులు తీసుకెళ్లిన వారిపై కేసు నమోదు చేయడంలో జాప్యం ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

బాధితుల మాట వినేది ఎవరు?

న్యాయం కోసం పోలీస్ స్టేషన్‌కు వచ్చే బాధితులకు భరోసా కల్పించాల్సిన పోలీసులు.. ఫిర్యాదులను సకాలంలో పరిశీలించి, వాస్తవాలను నిర్ధారించి చట్టప్రకారం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

తన ఫిర్యాదులో పేర్కొన్న అంశాలపై సమగ్ర విచారణ జరిపి, వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని బాధితురాలు కోరుతున్నారు.

ఉన్నతాధికారులు స్పందించాలి

మలక్‌పేట్ పోలీస్ స్టేషన్‌లో బాధితురాలు చేసిన ఫిర్యాదుపై ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకున్నారు? కేసు నమోదు చేయడంలో జాప్యం ఎందుకు జరిగింది? ఇంటి తాళాలు పగలగొట్టి విలువైన వస్తువులు తీసుకెళ్లారన్న ఆరోపణలపై విచారణ ఏ దశలో ఉంది? అనే అంశాలపై ఉన్నతాధికారులు సమీక్షించాలని బాధితురాలు విజ్ఞప్తి చేస్తున్నారు.

తన ఫిర్యాదుకు సంబంధించిన వివరాలను పోస్టు ద్వారా ఉన్నతాధికారులకు కూడా పంపించినట్లు ఆమె పేర్కొన్నారు. ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని నిష్పక్షపాతంగా విచారణ జరిపి, తనకు న్యాయం చేయడంతో పాటు తన విలువైన వస్తువులు తిరిగి ఇప్పించి, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బాధితురాలు కోరుతున్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!