ఛత్రినాక నుంచి కందికల్ గేట్ వరకు జూలై 1 నుంచి ట్రాఫిక్ ఆంక్షలు
మన తొలివెలుగు, చాంద్రాయణగుట్ట ప్రతినిధి శైలేష్ కుమార్ నార్కెట్ పల్లి :
పాతబస్తీ ఛత్రినాక ప్రాంతంలో సీసీ రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్న నేపథ్యంలో ట్రాఫిక్ మళ్లింపులు అమలు చేయనున్నట్లు హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయల్ డేవిస్ తెలిపారు. ఛత్రినాక నుండి కందికల్ గేట్ ఫ్లైఓవర్ వరకు జరుగుతున్న సిమెంట్ కాంక్రీట్ రోడ్డు పనులను ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే, చార్మినార్ జోన్ ట్రాఫిక్ ఏసీపీ కే లక్ష్మణ్, ఛత్రినాక ఇన్స్పెక్టర్ సంతోషం, జీహెచ్ఎంసీ ఏఈ ఆర్తి, ఈఈ నరేందర్ గౌడ్, తదితర అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యవేక్షించారు.
మళ్లింపు మార్గాలు :

నల్లవాగు శ్మశానవాటిక వద్ద వాహనాలను ఓల్డ్ చాంద్రాయణగుట్ట వైపు మళ్లిస్తారు, లాల్ దర్వాజా వాహనాలను ఇంజిన్ బౌలి వైపు మళ్లిస్తారు. ఉప్పుగూడ వాహనాలను పంచముఖి హనుమాన్ గుడి వద్ద నుంచి గౌలిపుర వైపు మళ్లిస్తారు. ఈ మార్గాల్లో ప్రయాణించే వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని, పోలీసుల సూచనలు పాటించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. రోడ్డు పనులు పూర్తయ్యే వరకు ప్రజలు సహకరించాలని కోరారు.

