ePaper
Sunday, November 1, 2026
📄 ePaper
Homeయాదాద్రి భువనగిరి జిల్లాధాన్యం కొనుగోళ్లలో జాప్యమెందుకు? రైతుల గోస పట్టదా ప్రభుత్వానికి!

ధాన్యం కొనుగోళ్లలో జాప్యమెందుకు? రైతుల గోస పట్టదా ప్రభుత్వానికి!

📰 Generate e-Paper Clip

రైతుల సమస్యలపై సమరశంఖం.. నవంబర్ 15న నల్లగొండలో రైతు మహాగర్జన

అఖిల భారత రైతు సంఘం భారీ బహిరంగ సభను జయప్రదం చేయండి

సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ పిలుపు 

మన తొలివెలుగు | భువనగిరి రూరల్ ప్రతినిధి కే. నాగమణి | అక్టోబర్ 28, 2026 :

ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు తీసుకొచ్చిన వడ్లను ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ డిమాండ్ చేశారు. రైతులు పండించిన ధాన్యాన్ని విక్రయించేందుకు 20 నుంచి 25 రోజులుగా ఎదురుచూస్తున్నా కొనుగోళ్లు చేపట్టకపోవడం ఆందోళనకరమన్నారు.

బుధవారం సీపీఎం పోచంపల్లి మండల కమిటీ ఆధ్వర్యంలో జూలూరు గ్రామంలోని వ్యవసాయ మార్కెట్‌ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్న అనంతరం నర్సింహ మాట్లాడుతూ.. మండలంలోని పలు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం రాశులు పేరుకుపోయాయని, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఐకేపీ, సహకార సంఘాల కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉన్న ధాన్యాన్ని తక్షణమే కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

గత ఏడాది కూడా కొనుగోళ్లలో జాప్యం కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని, ధాన్యం వర్షానికి తడుస్తూ, ఎండకు ఎండుతూ నష్టపోయారని పేర్కొన్నారు. ధాన్యాన్ని కప్పి ఉంచేందుకు ఒక్కో రైతు రూ.10 వేలకుపైగా పట్టాల కోసం ఖర్చు చేయాల్సి వచ్చిందని తెలిపారు. ప్రభుత్వం రైతులకు ఉచితంగా ధాన్యం కప్పే పట్టాలు అందించడంతోపాటు కొనుగోలు కేంద్రాల్లో అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు.

నల్లగొండ రైతు మహాసభలను జయప్రదం చేయాలి

దేశవ్యాప్తంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి, రైతాంగ హక్కుల సాధనకు భవిష్యత్ ఉద్యమ కార్యాచరణ రూపొందించేందుకు నవంబర్ 15 నుంచి 18 వరకు నల్లగొండలో అఖిల భారత రైతు సంఘం 36వ జాతీయ మహాసభలు నిర్వహిస్తున్నట్లు నర్సింహ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా, పంటలకు గిట్టుబాటు ధరలు, సబ్సిడీ విత్తనాల సాధన కోసం రైతు సంఘం నిరంతరం పోరాడుతోందన్నారు.

నవంబర్ 15న నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు రైతులు, వ్యవసాయ కార్మికులు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సభలో జాతీయ నాయకులతోపాటు వ్యవసాయ రంగ నిపుణులు పాల్గొంటారని వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు కోట రామచంద్రారెడ్డి, సీపీఎం మండల కార్యదర్శి గూడూరు బుచ్చిరెడ్డి, మండల కార్యదర్శివర్గ సభ్యులు మంచాల మధు, రైతులు యాదమ్మ, ప్రతాప్‌రెడ్డి, మధు, లక్ష్మి, వెంకన్న, లక్ష్మమ్మ, మల్లమ్మ, పూజ, తిరుమల్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!