మన తొలివెలుగు, ఇబ్రహీంపట్నం ప్రతినిధి సీహెచ్ రాజు :
పదిహేను ఏళ్లుగా భూ సమస్య పరిష్కారం కాకపోవడంతో ఓ రైతు కాడెద్దులతో పాటు నాగలిని తీసుకుని తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని వినూత్నంగా నిరసన తెలిపిన ఘటన రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలో చర్చనీయాంశమైంది. మొగుళ్లవంపు గ్రామానికి చెందిన బత్తైన పాండురంగారెడ్డి తనకు రావాల్సిన 3 ఎకరాల భూమిని తన పేరుతో ఆన్లైన్ లో నమోదు చేసి పట్టాదారు పాస్బుక్ ఇవ్వాలని 15 ఏళ్లుగా తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా సమస్య పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీనివల్ల ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు కూడా అందడం లేదని తెలిపారు. సమస్య పరిష్కరించకపోవడంతో విసిగి వేసారిపోయి తన కాడెడ్లతో రైతు తహసీల్దార్ కార్యాలయానికి వచ్చి నిరసన తెలిపాడు. సమాచారం అందుకున్న తహసీల్దార్ అయ్యప్ప రైతుతో మాట్లాడి పూర్తి వివరాలతో దరఖాస్తు ఇవ్వాలని, భూ రికార్డులను పరిశీలించి చట్టపరంగా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో రైతు తన ఆందోళనను విరమించారు.

