విద్యార్థులు, యువతకు కలాం జీవితం స్ఫూర్తిదాయకం
మాజీ కార్పొరేటర్ మొద్దు లచ్చి రెడ్డి

మన తొలివెలుగు | ఎల్బీనగర్ :
భారతరత్న, మాజీ రాష్ట్రపతి, ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి, ప్రపంచ విద్యార్థుల దినోత్సవాన్ని పురస్కరించుకుని బీఎన్ రెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని సచివాలయ నగర్లో స్ఫూర్తి సేవా సమితి ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బీఎన్ రెడ్డి నగర్ డివిజన్ జీహెచ్ఎంసీ తాజా మాజీ కార్పొరేటర్ మొద్దు లచ్చి రెడ్డి, అబ్దుల్ కలాం విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా మొద్దు లచ్చి రెడ్డి మాట్లాడుతూ.. శాస్త్రవేత్తగా, దేశ రాష్ట్రపతిగా డాక్టర్ అబ్దుల్ కలాం భారతదేశానికి అందించిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. సాంకేతిక, శాస్త్రీయ రంగాల్లో దేశం పురోగతి సాధించడంలో ఆయన కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. కలాం జీవితం, ఆయన ఆశయాలు నేటి విద్యార్థులకు, యువతకు గొప్ప స్ఫూర్తినిస్తాయని అన్నారు.
ప్రతి విద్యార్థి కలాం ఆశయాలను ఆదర్శంగా తీసుకుని క్రమశిక్షణ, పట్టుదల, నిరంతర కృషితో ఉన్నత లక్ష్యాలను సాధించాలని, దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు విజయ్ నేత, రవి శంకర్తో పాటు స్ఫూర్తి సేవా సమితి సభ్యులు సంజయ్ కుమార్, యాదగిరి, గిరి, సంజీవ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

