మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య
రాజకీయంగా ఎదుర్కోలేక భౌతిక దాడులకు దిగడం బీజేపీ దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు. కరీంనగర్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంపై బీజేపీ శ్రేణుల దాడిని బీఆర్ఎస్ఎల్పీ ఉప నేత సబితా ఇంద్రారెడ్డి తీవ్రంగా ఖండించారు. కరీంనగర్లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ అనుచరులు జరిపిన దాడి అత్యంత హేయమైన చర్యగా పేర్కొన్నారు.
ప్రజాస్వామ్యంలో విమర్శలకు తావుంటుంది కానీ, భౌతిక దాడులకు కాదని సబితా ఇంద్రారెడ్డి మండిపడ్డారు. రాజకీయంగా ఎదుర్కోలేక భౌతిక దాడులకు దిగడం బీజేపీ దిగజారుడం రాజకీయాలకు నిదర్శనమని అన్నారు. ఒక ఎమ్మెల్యే కార్యాలయంపైకి వచ్చి అద్దాలు పగలగొట్టి, విధ్వంసం సృష్టించడం దుర్మార్గపు చర్య అని తెలిపారు. ప్రశ్నిస్తే దాడి చేస్తారా? బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చినందుకు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై దాడికి ప్రయత్నించడం ఏమిటీ. అవే వ్యాఖ్యలు పదే పదే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై చేస్తున్నది ఎవరు. మీరు విమర్శలు చేస్తే భరించాలి కానీ అవే విమర్శలు మీపై చేస్తే దాడులు చేస్తారా అని ఆవేదన వ్యక్తం చేశారు.
పట్టపగలు ఒక కీలకమైన ప్రభుత్వ కార్యాలయంపై ఇంతటి దాడి జరుగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారని ఆమె ప్రశ్నించారు. పోలీసుల ముందే దాడి జరుగుతున్న ప్రేక్షక పాత్ర పోషించరన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపు తప్పాయనడానికి ఇదే నిదర్శనం అన్నారు. ఈ దాడికి పాల్పడిన నిందితులను, వారి వెనుక ఉన్న వ్యక్తులను వెంటనే గుర్తించి కఠినంగా శిక్షించాలన్నారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని సబితా రెడ్డి డిమాండ్ చేశారు.
బీజేపీ నాయకులు తమ గూండాగిరిని వీడాలి. ఇటు వంటి దాడులకు భయపడే ప్రసక్తే లేదు. ప్రజాక్షేత్రంలోనే మీకు తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి, కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని సబితా ఇంద్రారెడ్డి ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు.

