భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి
మన తొలివెలుగు, యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో ప్రతినిధి జంగిటి రవీందర్
దివ్యాంగులు సహాయ ఉపకరణాలు సద్వినియోగం చేసుకోవాలని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. బుధవారం రావిభద్రారెడ్డి ఫంక్షన్ హాల్ లో జిల్లా మహిళా శిశు వికలాంగుల వయో వృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వికలాంగుల కార్పొరేషన్, అలింకో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సి ఎస్ ఆర్ నిధులతో వికలాంగులకు, వయోవృద్ధులకు సహాయ ఉపకరణాల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వికలాంగులకు ప్రభుత్వం ద్వార దఫా దఫాలుగా పంపిణీ చేస్తున్నామని ఇంకా పరికరాలు రాని వారు బాధపడొద్దని త్వరలో మిగిలిన దివ్యాంగులకు అందరికి లబ్ది చేకూరేటట్లు చూస్తానన్నారు.

తెలంగాణ దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య మాట్లాడుతూ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్ర చరిత్రలో దివ్యాంగుల కోసం ఇంత విస్తృత స్థాయిలో సహాయ ఉపకరణాలు పంపిణీ చేయడం ఇదే తొలిసారని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన వెంటనే దివ్యాంగురాలు రజనీకి ఉద్యోగం కల్పించే ఫైల్ పైన తొలి సంతకం చేసిన ఘనత ఆయనదేనని పేర్కొన్నారు. ప్రభుత్వం ఉద్యోగాల్లో దివ్యాంగులకు నాలుగు శాతం రిజర్వేషన్స్, ఉన్నత విద్యలో ఐదు శాతం రిజర్వేషన్, ఇందిరమ్మ ఇళ్లలో ఐదు శాతం, రాజీవ్ యువ వికాసంలో ఐదు శాతం రిజర్వేషన్ లని దివ్యాంగుల సంక్షేమ ఆత్మగౌరవ ప్రతీక రేవంతన్న కల్పించారని పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఇద్దరు దివ్యాంగులు పెళ్లి చేసుకుంటే కళ్యాణ లక్ష్మితో పాటు అదనంగా వివాహ ప్రోత్సాహక బహుమతి కింద రూపాయలు రెండు లక్షలు అందిస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అని పేర్కొన్నారు. ప్రస్తుతం 40 శాతం వైకల్యం ఉన్నవారికి కూడా స్కూటీలతో పాటు ఉపకరణాలు వాహనాలు అందిస్తున్నామన్నారు. కలెక్టర్ భాస్కర్ రావు మాట్లాడుతూ ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక లో భాగంగా దివ్యాంగులకు సహాయ ఉపకరణాలు పంపిణీ చేయడం మంచి పరిణామమన్నారు. జిల్లాలో కార్పొరేషన్ ద్వారా 68. అలింకో సంస్థ ద్వార 518 మందికి పంపిణీ చేయటం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి నరసింహ రావు. గ్రంథాలయ సంస్థల ఛైర్మెన్ అవేజ్ చిస్థి, లోకల్ ఈడి ఎస్. రావు. సీడీపీఓలు వెంకట రమణ, శైలజ, స్వరాజ్యం, నాజీ, జిల్లా సంక్షేమ శాఖ సిబ్బంది, అలింకో సిబ్బంది, 600 మంది దివ్యాంగులు పాల్గొన్నారు.

