ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారికి ప్రార్థన
మన తొలివెలుగు | మహేశ్వరం ప్రతినిధి | ముత్తయ్య | అక్టోబర్ 17, 2026 :
మహేశ్వరం నియోజకవర్గ కేంద్రంలోని ప్రసిద్ధ శ్రీ శివగంగ రాజరాజేశ్వరి రాజరాజేశ్వర దేవస్థానంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పీ. సబితా ఇంద్రారెడ్డి ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామివారికి అభిషేకం నిర్వహించడంతో పాటు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి భక్తిశ్రద్ధలతో మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయానికి చేరుకున్న సబితా ఇంద్రారెడ్డికి వేద పండితులు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆలయ సంప్రదాయాల ప్రకారం వేద పండితులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పూజల అనంతరం ఆమెను శాలువాతో సత్కరించి, తీర్థప్రసాదాలు అందజేశారు. దీంతో ఆలయ ప్రాంగణంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ, మహేశ్వరం నియోజకవర్గ ప్రజలతో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరిపై అమ్మవారి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో, శాంతి సౌభాగ్యాలతో వర్ధిల్లాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో జీవించాలని అమ్మవారిని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ అల్లె కుమార్, మహేశ్వరం గ్రామ సర్పంచ్ మునగపాటి నవీన్, ఉపసర్పంచ్ జోరల రమేష్, నాయకులు సుధీర్ గౌడ్, కాడమోని ప్రభాకర్, ఆదిల్, బీఆర్ఎస్ కార్యకర్తలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

