₹. 50 కోట్ల ప్రభుత్వ భూమి హాంఫట్
పాతబస్తీలో బూడిదిగడ్డ కబ్జా..!?
తప్పుడు పత్రాలు సృష్టించి అమ్మకాలు
వాటితోనే విక్రయానికి అడ్వాన్సులు..?
బలి పశువులవుతున్న అమాయకులు..!
చోద్యం చూస్తున్న జీహెచ్ఎంసీ, రెవెన్యూ అధికారులు
ప్రజా ఆస్తీ కాపాడాలని ప్రజావాణిలో ఫిర్యాదు
కబ్జాదారుడిపై చర్యలు తీసుకోండి – స్థానికుల డిమాండ్
మన తొలివెలుగు తెలంగాణ బ్యూరో :
పాతనగరంలో ఓ కబ్జారాయుడు (నార్త్ ఇండియన్ సెటిలర్) పెట్రేగిపోతున్నాడు. ఖాళీ జాగా కనిపిస్తే చాలు పాగా వేస్తున్నాడు. ప్రభుత్వ స్థలాన్నిచదును చేసి పైసా.. పైసా కూడబెట్టిన అయాయకులకు విక్రయిస్తూ కోట్ల రూపాయలు సొమ్ము చేసుకునేందుకు తెరలేపాడు. రెవెన్యూ ఉద్యోగుల సహకారంలో రికార్డులను తారుమారు చేసి దర్జాగా ఆక్రమణలకు పాల్పడుతున్నాడు. పాతబస్తీ బండ్లగూడ మండలం కందికల్ గ్రామ రెవెన్యూ పరిధిలో కోట్లాది రూపాయల విలువ చేసే 1.20 ఎకరాల ప్రభుత్వ భూమిని అక్రమించి చదును చేస్తున్నాడు. రాత్రి రాత్రి జేసీబీలతో బూడిదిగడ్డలోని బూడిదిని తొలగిస్తున్నాడు. ఇంత జరుగుతున్నా.. రెవెన్యూ అధికారులుగానీ, జీహెచ్ఎంసీ అధికారులుగానీ చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోందని స్థానికులు వాపోతున్నారు.
ఖాళీ జాగా కనిపిస్తే.. కబ్జా..?
పాతబస్తీ.. అంటే లాల్‌దర్వాజా.. ఉప్పుగూడలో హిందూ బెల్ట్ ఎక్కువగా ఉండే ప్రాంతంలో సదురు నార్త్ ఇండియన్ సెటిలయ్యారు. ఏళ్ల తరబడి పాతబస్తీ ప్రజలతో మమేకమయ్యాడు. ఇక్కడి ప్రజల జీవన శైలిని పసిగట్టాడు. ఆర్థికంగా, రాజకీయంగా ఎదిరించే శక్తి తక్కువగా ఉండడంతో ఆ సెటిలర్కు కలిసి వచ్చిన విషయమనే చెప్పాలి. ఇంకే ముందు లాల్ దర్వాజా, ఉప్పుగూడ పరిసర ప్రాంతంలో ఉన్న బోరంబోకు (సర్కారీ) స్థలాలను గుర్తించాడు. వాటిని చెరబట్టేందుకు పాచికలు సిద్దం చేసుకున్నాడు. పాతబస్తీలో పాతుకుపోయిన ఓ మత రాజకీయ పార్టీ అండదండలు సంపాదించుకున్నాడు. అధికారులను మచ్చిక చేసుకున్నాడు. తరువాత తన పని మొదలు పెట్టాడు. గతంలో ఉప్పుగూడ ప్రాంతంలో ఓ దేవాలయ భూమి కబ్జా చేసి ప్లాట్లుగా విక్రయించి కోట్ల రూపాయలు సొమ్ము చేసుకున్నాడు. ఈ విషయం పాతబస్తీ ప్రజలకు జరమెరిగిన సత్యం. అలా అక్రమార్జనతో కోట్లకు పడగలెత్తాడు. సెటిలర్ కాస్తా.. పాతబస్తీలో తిరుగులేని కోటీశ్వరుడిగా చెలామణి అవుతూ.. వచ్చాడు. ఖాళీగా ఉన్న అనేక ప్రభుత్వ స్థలాలను కబ్జా చేశాడు. ప్రస్తుతం అతడి కన్ను పాతబస్తీ పటేల్‌నగర్‌లోని బూడిదిగడ్డపై పడింది. పని మొదలు పెట్టాడు. అధికారులను మచ్చిక చేసుకున్నాడు. రికార్డులను తారుమారు చేశాడు. ఆ స్థలానికి సంబంధించిన నకిలీ డాక్యూమెంట్లను సృష్టించాడు. రాత్రికి రాత్రి.. జేసీబీలతో బూడిదిగడ్డను మింగేసే పనిలో పడ్డాడు. ఇంత జరుగుతున్నా.. పాతబస్తీకి చెందిన నేతలుగానీ, అధికారులుగానీ పట్టించుకోకపోవడం వెనుక.. ఎవరికి ముట్టాల్సిన ముడుపులు.. వారికి ముట్టే ఉంటాయనే గుసగుసలు ఉప్పుగూడ ప్రాతంలో జోరుగా వినిపిస్తున్నాయి.
అయాయకులే బలి పశువులు..
పాతబస్తీలోని ఉప్పుగూడ పటేలనగర్లోని ప్రభుత్వ భూమిలో ప్లాటింగ్ చేసి ఏదో రకంగా అమ్మేస్తారు. కానీ ఆ ప్లాట్లను కొనుగోలు చేసే అమాయకుల పరిస్థితి ఏమిటనేది అర్థం కావడంలేదు. గతంలో అనేక ప్రభుత్వ, దేవాదాయ భూములలో ప్లాట్లు చేసి విక్రయించి సోమ్ము చేసుకున్నా.. ప్రస్తతం ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే రాష్ట్రంలో ఇప్పటికే సర్కారీ భూముల్లో చేసిన నిర్మాణాలను ప్రభుత్వం కూల్చివేస్తుంది. హైడ్రాకు ఫిర్యాదులు వెలువెత్తితే ఇక అంతే సంగతి. ఇలాంటి పరిస్థితిలో కూడా అధికారులు అక్రమార్కుడికి సహకరించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇలా ప్రభుత్వ భూమిని ఆక్రమించి వెంచర్ చేసే అక్రమార్కుడిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ స్థలాన్ని కాపాడి ప్రజా అవసరాల కోసం ఉపయోగించాలని, ప్రజలకు ఉపయోగపడే కార్యాలయాలను ఏర్పాటు చేయాలని కోరుతూ.. ఇప్పటికే భాగ్యనగర్ సిటిజన్ వెల్పేర్ అసోసియేషన్ ప్రతినిధులు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఈ కబ్జా వ్యవహారాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేందుకు కలెక్టర్‌కు, హైడ్రా కమిషనర్‌కు కూడా ఫిర్యాదు చేయనున్నట్లు అసోసియేషన్ ప్రతినిధులు పేర్కొంటున్నారు. అక్రమ వెంచర్ అని తెలిసినా.. అడ్డుకోకుండా చోద్యం చూస్తున్న అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. మరి హైదరాబాద్ జిల్లా కలెకర్ట్ ఈ విషయంలో ఎలా స్పందిస్తారనేది వేచి చూడాల్సి ఉంది.

