ePaper
Wednesday, September 16, 2026
📄 ePaper
Homeతెలంగాణప్రభుత్వ రంగ సంస్థల ఉనికి కనుమరుగు..!

ప్రభుత్వ రంగ సంస్థల ఉనికి కనుమరుగు..!

📰 Generate e-Paper Clip

రోజుకో సంస్థ విలీనానికి శ్రీకారం.. ఉద్యోగుల్లో ఆందోళన

మన తొలివెలుగు | ప్రత్యేక కథనం

తెలంగాణ ప్రజలకు, రైతులకు, పారిశ్రామిక రంగానికి దశాబ్దాలుగా సేవలందిస్తున్న ప్రభుత్వ రంగ సంస్థల ఉనికి రోజురోజుకూ కనుమరుగవుతోందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఒకప్పుడు ప్రజా సేవలో కీలక పాత్ర పోషించిన సంస్థలు పాలకుల నిర్లక్ష్యం, సరైన నియామకాలు లేకపోవడం, ఆర్థిక సమస్యలు తదితర కారణాలతో బలహీనపడుతున్నాయని ప్రభుత్వ రంగ ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి.

పేదలకు, రైతులకు, పారిశ్రామిక రంగానికి అండగా నిలిచిన ప్రభుత్వ రంగ సంస్థలను బలోపేతం చేయాల్సిన ప్రభుత్వం.. వాటిని ఇతర సంస్థల్లో విలీనం చేసే దిశగా అడుగులు వేస్తుండటం ఉద్యోగుల్లో భయాందోళనలకు కారణమవుతోంది. ఇప్పటికే ఇరిగేషన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ను మరో సంస్థలో విలీనం చేసిన నేపథ్యంలో, తాజాగా ఆగ్రోస్‌ను సీడ్ కార్పొరేషన్‌లో విలీనం చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయనే చర్చ ఉద్యోగ వర్గాల్లో నెలకొంది.

93 ప్రభుత్వ రంగ సంస్థలు.. పరిస్థితి ఏమిటి?

తెలంగాణలో సుమారు 93 ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయని ప్రభుత్వ రంగ ఉద్యోగుల సమాఖ్య పేర్కొంటోంది. వీటిలో 26 సంస్థలు కుల సంఘాల ప్రాతిపదికన కొనసాగుతున్నాయని, మరో 6–7 సంస్థలు స్వయం ప్రతిపత్తితో పనిచేస్తున్నాయని చెబుతోంది. మిగిలిన సంస్థల్లో కొన్ని ప్రభుత్వ సహకారంతో లాభాల్లో కొనసాగుతుండగా, మరికొన్ని ఆర్థిక సమస్యలతో మనుగడ కోసం పోరాడుతున్నాయని ఉద్యోగ సంఘాలు అంటున్నాయి.

కొత్త నియామకాలు లేక.. అవుట్‌సోర్సింగ్‌పై ఆధారపడుతున్న సంస్థలు

ప్రభుత్వ రంగ సంస్థల్లో ఒకప్పుడు భారీగా ఉద్యోగ నియామకాలు జరిగేవని, ఆ తర్వాత కొత్త నియామకాలు చేపట్టకపోవడంతో సిబ్బంది కొరత ఏర్పడిందని ఉద్యోగులు చెబుతున్నారు. దీంతో అనేక సంస్థలు అవుట్‌సోర్సింగ్ సిబ్బందిపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడిందని పేర్కొంటున్నారు.

పరిస్థితులకు అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చి సంస్థలను ఆధునీకరించే అవకాశం ఉన్నప్పటికీ ప్రభుత్వం ఆ దిశగా తగిన చర్యలు చేపట్టడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఫలితంగా ప్రజలకు, ముఖ్యంగా రైతులకు అందాల్సిన సేవల్లో అంతరాయం ఏర్పడే ప్రమాదం ఉందని ఉద్యోగ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

రైతులకు అండగా నిలిచిన సంస్థలు

టూరిజం, సివిల్ సప్లయిస్, మార్క్‌ఫెడ్, సీడ్ కార్పొరేషన్, ఆగ్రోస్, ఇరిగేషన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ వంటి సంస్థలు రైతులు, ప్రజలు, పారిశ్రామిక రంగానికి ఎన్నో సంవత్సరాలుగా సేవలందించిన చరిత్ర ఉందని ఉద్యోగ సంఘాలు గుర్తుచేస్తున్నాయి. ఇలాంటి సంస్థలను మూసివేయడం లేదా విలీనం చేయడం కంటే వాటికి కొత్త సాంకేతికత, ఆర్థిక వనరులు, సమర్థవంతమైన పరిపాలన అందించి పునరుజ్జీవింపజేయాల్సిన అవసరం ఉందని పేర్కొంటున్నాయి.

అనుభవజ్ఞులైన ఐఏఎస్ అధికారులను నియమించాలి

ప్రభుత్వ రంగ సంస్థల నిర్వహణలో అనుభవం ఉన్న, నైపుణ్యం కలిగిన ఐఏఎస్ అధికారులను నియమిస్తే సంస్థల పనితీరు మరింత మెరుగుపడే అవకాశం ఉందని తెలంగాణ ప్రభుత్వ రంగ ఉద్యోగుల సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీటి జీవన్ సూచిస్తున్నారు. సంస్థలను రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా ప్రజా సేవ, ఆర్థిక స్వావలంబన లక్ష్యాలతో నిర్వహించాల్సిన అవసరం ఉందని ఆయన కోరుతున్నారు.

ఉద్యోగ భద్రతతో పాటు కొత్త నియామకాలు చేపట్టాలి

విలీన ప్రక్రియలో ఉన్న సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని జీటి జీవన్ విజ్ఞప్తి చేస్తున్నారు. ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడంతో పాటు కొత్త ఉద్యోగ నియామకాలు చేపట్టి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలని కోరుతున్నారు.

ప్రభుత్వ రంగ సంస్థలకు జీవం పోసి, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి వాటిని అభివృద్ధి బాటలో నడిపించాలని.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో పాటు సంబంధిత మంత్రులు ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన విజ్ఞప్తి చేస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!