ePaper
Wednesday, September 16, 2026
📄 ePaper
Homeమహేశ్వరంఅక్ర‌మ షెడ్డు నిర్మాణంపై అధికారులు మౌనం..!

అక్ర‌మ షెడ్డు నిర్మాణంపై అధికారులు మౌనం..!

📰 Generate e-Paper Clip

బ‌డంగ్‌పేట్ స‌ర్కిల్ ప‌రిధిలో పుట్ట‌గొడుగుల్లా వెలుస్తున్న అక్ర‌మ షెడ్లు 

అనుమ‌తులు లేకుండానే నిర్మాణాలు

జిల్లెల‌గూడ హెచ్‌పీ పెట్రోల్ బంక్ వెన‌కాల జోరుగా సాగుతున్న భారీ షెడ్డు నిర్మాణ ప‌నులు 

చోద్యం చూస్తున్న బడంగ్‌పేట్ డిప్యూటీ క‌మిష‌న‌ర్‌, టౌన్‌ ప్లానింగ్ అధికారులు

మామూళ్ల మ‌త్తులో టౌన్‌ప్లానింగ్ విభాగ‌మ‌నే ఆరోప‌ణ‌లు 

ప్ర‌భుత్వ ఆదాయానికి భారీ మొత్తంలో గండి

జోన‌ల్ క‌మిష‌న‌ర్ ప‌ర్య‌వేక్ష‌ణ‌ లేక‌పోవ‌డంపై ప్ర‌జ‌ల ఆగ్ర‌హం 

మ‌న తొలివెలుగు మ‌హేశ్వ‌రం ప్ర‌తినిధి : శంషాబాద్Í జోన్ బడంగ్‌పేట్ స‌ర్కిల్ ప‌రిధిలో అక్ర‌మ నిర్మాణాలు య‌థేచ్ఛ‌గా సాగుతున్నా అధికారులు ప‌ట్టించుకోవ‌డంలేద‌నే ఆరోప‌ణ‌లు వెలువెత్తుతున్నాయి. ముఖ్యంగా మీర్‌పేట్‌, జిల్లెల‌గూడ‌, అల్మాస్‌గూడల‌లో ఎలాంటి అనుమ‌తులు లేకుండా, మ‌రికొన్ని చోట్ల అనుమ‌తుల‌కు విరుద్దంగా భారీ క‌మ‌ర్షియ‌ల్ నిర్మాణాలు, షెడ్డులు వెలుస్తున్నా టౌన్ ప్లానింగ్ అధికారులు చ‌ర్య‌లు తీసుకోవ‌డం లేద‌ని స్థానికులు మండిప‌డుతున్నారు. ప‌లుమార్లు ఫిర్యాదులు చేసినా స్పంద‌న లేద‌ని ఆరోపిస్తున్నారు. ఇదే ప్రాంతంలో డిప్యూటీ క‌మిష‌న‌ర్ ప‌లు మార్లు ప‌ర్య‌టించిన‌ప్ప‌టికీ అక్ర‌మ నిర్మాణాల‌పై మౌనం పాటిస్తున్నార‌ని విమ‌ర్శిస్తున్నారు. తాజాగా జిల్లెల‌గూడ ప్ర‌భుత్వ ఉన్న‌త పాఠ‌శాల ఎదురుగా, హెచ్‌పీ పెట్రోల్ బంక్ వెనుకాల వెలుస్తున్న భారీ షెడ్డు నిర్మాణంపై అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. అక్ర‌మ నిర్మాణాల‌పై స‌మ‌గ్ర విచార‌ణ జ‌రిపి బాధ్యుల‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ప‌లువురు డిమాండ్ చేస్తున్నారు.

అనుమ‌తులు లేకుండా నిర్మాణాలు చేప‌ట్టినా.. తీసుకున్న అనుమ‌తుల‌కు విరుద్దంగా అద‌న‌పు అంత‌స్తులు, క‌మ‌ర్షియ‌ల్ నిర్మాణాలు చేప‌డుతున్నా బడంగ్‌పేట్ స‌ర్కిల్ అధికారులు ప‌ట్టించుకోవ‌డం లేద‌నే ఆరోప‌ణ‌లు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా జిల్లెల‌గూడ హెచ్‌పీ పెట్రోల్ బంక్ వెన‌కాల నిబంధ‌న‌ల‌ను భేఖాత‌రు చేస్తూ.. ఎటువంటి అనుమ‌తులు లేకుండా భారీ షెడ్డు నిర్మిస్తున్నా సంబంధిత టౌన్‌ప్లానింగ్ అధికారులు చూసీచూడ‌న‌ట్లు వ్య‌వ‌హ‌రిస్తున్నార‌నే విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. ప్ర‌ధాన ర‌హ‌దారి ప‌క్క‌నే హెచ్‌పీ పెట్రోల్ బంక్ వెన‌కాల ఎలాంటి అనుమ‌తులు లేకుండా ద‌ర్జాగా కొన్ని నెల‌లుగా నిర్మాణం సాగుతున్నా స‌ర్కిల్ అధికారులు మాత్రం చ‌ర్య‌ల‌కు వెన‌కాడుతున్నార‌నే ఆరోప‌న‌లు ఉన్నాయి. అక్ర‌మ షెడ్డు నిర్మాణంపై స్థానికులు ప‌లుమార్లు ఫిర్యాదులు అంద‌జేసినా పట్టించుకునే నాధుడు క‌రువ‌య్యార‌ని ప‌లువురు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

టౌన్ ప్లానింగ్‌పై తీవ్ర ఆరోప‌ణ‌లు 

బడంగ్‌పేట్ స‌ర్కిల్ టౌన్ ప్లానింగ్ విభాగం ప‌నితీరుపై తీవ్ర విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. గ‌తంలో కోట్లాది రూపాయ‌ల స్కాం బయ‌ట‌ప‌డిన‌ కూడా బడంగ్‌పేట్ స‌ర్కిల్ అధికారుల తీరులో మాత్రం మార్పు రావడంలేద‌ని స్థానిక ప్ర‌జ‌లు వాపోతున్నారు. వాళ్ల‌కు అందాల్సిన‌వి అందితే చాలు అన్న విధంగా అధికారులు వ్య‌వ‌హ‌రిస్తున్న‌ర‌నే ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఉన్న‌తాధికారుల ప‌ర్య‌వేక్ష‌ణ లేక‌పోవ‌డంతో ఆడిందే ఆట.. పాడిందే పాట‌.. అన్న చందంగా మారుతోంది. గ‌త మున్సిప‌ల్ పాల‌న‌లో ఇదే విధంగా ఉన్న వ్య‌వ‌హారం కార్పొరేష‌న్‌లో విలీనం చేసిన త‌ర్వాత కూడా ప‌రిస్థితిలో ఏమాత్రం మార్పురాక‌పోవ‌డం గ‌మ‌నార్హం.

అధికారుల మౌనం ఎందుకు..?

అక్ర‌మ నిర్మాణాల‌పై ఫిర్యాదులు వ‌స్తున్న‌ప్ప‌టికీ వాటి స్థితిగ‌తులు, తీసుకున్న చ‌ర్య‌లు, అనుమ‌తుల వివ‌రాలు అధికారులు వెల్ల‌డించ‌క‌పోవ‌డం మ‌ర‌న్ని అనుమానాల‌కు కార‌ణ‌మ‌వుతోంది. నిబంధ‌న‌లు ఉల్లంఘించిన నిర్మాణాల‌పై చ‌ట్ట ప్ర‌కారం చ‌ర్య‌లు తీసుకుంటున్నారా..? లేక రాజ‌కీయ‌, ఆర్థిక ఒత్తిళ్ల‌కు త‌లొగ్గుతున్నారా.. అనే అనుమానాలు కూడా క‌లుగుతున్నాయి. అక్ర‌మ షెడ్డు నిర్మాణాలు, ఇత‌ర అవ‌క‌త‌వ‌క‌ల‌పై ప్ర‌జ‌లు ఉన్న‌తాధికారుల‌కు ఫిర్యాదు చేసినా కూడా బ‌డంగ్‌పేట్ స‌ర్కిల్ అధికారులు నిమ్మ‌కు నీరెత్తిన‌ట్లుగా వ్య‌వ‌హ‌రించ‌డం ప‌ట్ల స్థానికులు అస‌హ‌నం వ్య‌క్తం చేస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!