ePaper
Wednesday, November 4, 2026
📄 ePaper
Homeఎల్బీనగర్కాంగ్రెస్‌ను భ్రష్టు పట్టిస్తున్న మధుయాష్కిని తరిమికొట్టాలి

కాంగ్రెస్‌ను భ్రష్టు పట్టిస్తున్న మధుయాష్కిని తరిమికొట్టాలి

📰 Generate e-Paper Clip

ఎల్బీనగర్‌ నుంచి తరిమికొట్టేంత వరకు నా పోరాటం ఆగదు

వైఎస్సార్‌ వర్ధంతి కార్యక్రమంలో సీనియర్‌ నేత జక్కిడి ప్రభాకర్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు

మన తొలివెలుగు | ఎల్బీనగర్‌: 

కాంగ్రెస్‌ పార్టీని ఎవరైనా భ్రష్టు పట్టించే ప్రయత్నం చేస్తే సహించేది లేదని, ఎల్బీనగర్‌లో పార్టీని కాపాడేందుకు తన పోరాటం కొనసాగుతుందని కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు జక్కిడి ప్రభాకర్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్‌ పార్టీని భ్రష్టు పట్టిస్తున్న మధుయాష్కిని ఎల్బీనగర్‌ నుంచి తరిమికొట్టే వరకు తన పోరాటం ఆగదని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, దివంగత కాంగ్రెస్‌ నేత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి వర్ధంతి సందర్భంగా ఎల్బీనగర్‌లోని వైఎస్సార్‌ చౌరస్తాలో ఆయన విగ్రహానికి జక్కిడి ప్రభాకర్‌రెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగారని, పేద ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేసి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని ప్రభాకర్‌రెడ్డి పేర్కొన్నారు. వైఎస్సార్‌ స్ఫూర్తితో తాను కూడా గత 40 ఏళ్లుగా ఎలాంటి లాభాపేక్ష లేకుండా కాంగ్రెస్‌ పార్టీ సిద్ధాంతాల కోసం పనిచేస్తున్నానని తెలిపారు.

విగ్రహం ఏర్పాటు విషయంలో విభేదాలు

ఎల్బీనగర్‌లో వైఎస్సార్‌ విగ్రహం ఏర్పాటు విషయంలో మధుయాష్కి అడ్డంకులు సృష్టించారని ప్రభాకర్‌రెడ్డి ఆరోపించారు. అయితే ఆ అడ్డంకులను అధిగమించి తానే విగ్రహాన్ని ఏర్పాటు చేశానని చెప్పారు. ఈ వ్యవహారంలో తనపై వ్యక్తిగత కక్ష పెంచుకుని, కల్పిత ఆడియోలతో కుట్రలు చేశారని, పార్టీ పెద్దలపై ఒత్తిడి తీసుకువచ్చి తనను సస్పెండ్‌ చేయించారని ఆరోపించారు.

అనుచరులపై తీవ్ర ఆరోపణలు

మధుయాష్కి, ఆయన అనుచరులు ఎల్బీనగర్‌లో విచ్చలవిడిగా దోపిడీకి పాల్పడుతున్నారని ప్రభాకర్‌రెడ్డి ఆరోపించారు. మసాజ్‌ సెంటర్ల ఏర్పాటు ద్వారా యువతను తప్పుదారి పట్టిస్తున్నారని విమర్శించారు. డాక్టర్‌ హోదా లేని వ్యక్తి ఆసుపత్రులు ఏర్పాటు చేసి ప్రజల నుంచి అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. అంతేకాకుండా ఎల్బీనగర్‌లోని ప్రైవేట్‌ ఆసుపత్రులను సిండికేట్‌గా మార్చి రోగుల నుంచి భారీగా వసూళ్లు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ ఆరోపణలకు సంబంధించి తన వద్ద ఆధారాలు ఉన్నాయని, సరైన సమయంలో ప్రత్యేక మీడియా సమావేశం నిర్వహించి వివరాలను వెల్లడిస్తానని తెలిపారు.

పదవులపై ఊహాలోకంలో ఉన్నారంటూ విమర్శలు

పీసీసీ అధ్యక్షుడు, మంత్రి, ముఖ్యమంత్రి వంటి పదవులు వస్తాయంటూ మధుయాష్కి తనకు తాను ప్రచారం చేసుకుంటున్నారని ప్రభాకర్‌రెడ్డి విమర్శించారు. ప్రజాక్షేత్రంలో బలం లేని వ్యక్తికి కీలక పదవులు ఇస్తే వ్యక్తిగత ప్రయోజనం తప్ప పార్టీకి ఎలాంటి లాభం ఉండదని అన్నారు. తాను గాంధీభవన్‌లో మధుయాష్కిపై మాట్లాడిన తర్వాతే ఆయన ఎల్బీనగర్‌లో పర్యటనలు పెంచారని పేర్కొన్నారు. మధుయాష్కికి ఎల్బీనగర్‌ ప్రజలపై నిజమైన ప్రేమ లేదని, కేవలం కలెక్షన్ల కోసమే ఇక్కడికి వస్తున్నారని ఆరోపించారు.

18 డివిజన్లలో పార్టీ పరిస్థితిపై ఆందోళన

మధుయాష్కి నాయకత్వంలో 18 డివిజన్లు ఉన్న ఎల్బీనగర్‌లో కాంగ్రెస్‌ పార్టీ కనీసం ఖాతా తెరవలేని పరిస్థితి ఏర్పడిందని కొన్ని సర్వే, మీడియా సంస్థలు వెల్లడించాయని ప్రభాకర్‌రెడ్డి పేర్కొన్నారు. పార్టీకి ఇలాంటి పరిస్థితి ఎందుకు ఏర్పడిందో కాంగ్రెస్‌ పార్టీ పెద్దలు, స్థానిక నాయకులు ఆలోచించుకోవాలని సూచించారు. తాను చివరి వరకు కాంగ్రెస్‌ పార్టీలోనే కొనసాగుతానని స్పష్టం చేసిన ప్రభాకర్‌రెడ్డి.. కన్నతల్లి లాంటి కాంగ్రెస్‌ పార్టీని ఎవరైనా భ్రష్టు పట్టిస్తే చూస్తూ ఊరుకోబోనన్నారు.

ఎల్బీనగర్‌లో కాంగ్రెస్‌ పార్టీని కాపాడేందుకు, మధుయాష్కిని ఎల్బీనగర్‌ నుంచి తరిమికొట్టే వరకు తన పోరాటం కొనసాగుతుందని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!